హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ఈ నెల 29న, నవంబర్ 2న అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో రాబోయే రెండ్రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారకుండానే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరాన్ని దాటిందని పేర్కొన్నది. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
శుక్రవారం రాష్ట్రంలోని ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.