నిర్మల్ అర్బన్, మార్చి 28 : నిర్మల్ గుట్టలపై పలుచోట్ల రాగాలు పలికే అరుదైన రాళ్ల ను గుర్తించినట్టు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావు శనివారం తెలిపారు. ఈ రాళ్లను అరుదైన భౌతిక వారసత్వంగా రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇవి బాసర గుట్టలు, నిర్మల్ పట్టణంలోని గండిరామన్న గుట్టపైన ఖిల్లా గుట్ట పశ్చిమ వైపు రాళ్ల శ్రేణిలో ఉన్నాయని తెలిపారు.
66 మిలియన్ ఏండ్ల క్రితం దక్కన్ పీఠభూమిలో అగ్ని పర్వతాల విస్ఫోటాల వల్ల పైకి వచ్చిన లావా గట్టిపడి బా స్టాల్ శిలగా మారిందని వివరించారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన కొన్ని శిలలు ఘన నిర్మాణం కారణంగా శబ్ద తరంగాలను ప్రత్యేకంగా ప్రతిధ్వనింపజేస్తాయని పేర్కొన్నారు. ఈ అరుదైన రాళ్లను జియో హెరిటేజ్ స్పాట్ గా అభివృద్ధి చేసి రక్షించాలని సూచించారు. ఈ క్షేత్ర పర్యటనలో నేరెళ్ల హన్మంతు, అబ్బ డి రాజేశ్వర్, దొంతుల భీమేశ్ ఉన్నారు.