ఇరుగు: ఎందుకంత నీరసంగా ఉన్నారు. ఏదన్నా సమస్యా!పొరుగు: లేదులేదు! మొన్నే మా అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది.
ఇరుగు: మంచి విషయమే కదా. మరి ఎందుకంత డల్‌గా ఉంటున్నారు.
పొరుగు: అదేం లేదు కానీ, రిజిస్ట్రేషన్ సమయంలో లింక్ డాక్యుమెంట్స్ చూశాను. 30 ఏళ్ల క్రితం అక్కడ గజం అయిదు వందలే తెలుసా! అప్పట్లో మా నాన్నగారు తన రిటైర్మెంట్ డబ్బుల నుంచి లక్ష రూపాయలు నా వాటాగా ఇచ్చారు.
ఆ లక్ష రూపాయల్ని బ్యాంకులోనే ఉంచేశాను. అదే డబ్బుతో ఓ రెండు వందల గజాలు కొనుంటే ఈపాటికి కోటీశ్వరుణ్ని అయ్యేవాడిని కదా!ఇలాంటి సంభాషణలు మనం ఎన్ని విని ఉంటామో కదా! ఆ మాటకు వస్తే, ఇలాంటి ఆలోచనలు మనకు ఎన్ని తట్టి ఉంటాయో. జీవితంలో మన చేతికి చిక్కిన డబ్బు లేదా అప్పు చేయగలిగే స్తోమతతో కొన్ని గజాలు, కొంత బంగారమో కొని ఉంటే ఈపాటికి మన జీవితమే మారిపోయి ఉండేదన్న పశ్చాత్తాపం ఎన్నిసార్లు మనల్ని దహించేయలేదు! అంతదాకా ఎందుకు! ఒకే నెలలో రెట్టింపైన వెండి ధరలు చూసి ఎన్ని మనసులు చిన్నబోలేదు. నిజంగానే మనం ఏదో కోల్పోతున్నామా? పెట్టుబడి పెట్టాల్సినప్పుడు స్తబ్ధుగా ఉండి తప్పు చేస్తున్నామా? లేదా సవాలక్ష సమస్యలతో పాటు మరేదన్నా మానసిక సమస్యను ఎదుర్కొంటున్నామా? ఈ ప్రశ్నలకు జవాబే FOMO (Fear of Missing Out)ఓ తరం క్రితం సంగతి.
అప్పట్లో సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు. ప్రయాణం చేయాలన్నా, ఫోన్ మాట్లాడాలన్నా, కొనాలన్నా, తినాలన్నా… ప్రతిదీ ఓ ప్రయాసే! ఇప్పుడలా కాదు, క్షణంలోనే సమాచారం,పది నిమిషాల్లో కోరుకున్న సరుకు, ఏది నచ్చినా ఆన్లైన్లో తెప్పించుకునే సౌకర్యం. అసలు ఈ వస్తువు మీకు నచ్చుతుందేమో చూడండి అంటూ ఊరించే లక్షల వస్తు ప్రపంచం.
ఇప్పుడు సాంకేతికత ఓ సౌకర్యం కాదు. వస్తువు ఉపయోగం కోసం మాత్రమే కాదు. ఖర్చు అవసరం స్థాయిని దాటి వ్యాపకంగానో, వ్యసనంగానో మారిన సందర్భం. సంతోషానికీ, సుఖానికీ మధ్య హద్దులు చెరిగిన వైనం. మారిన ఈ పరిస్థితులకు ఓ సూచన కాబట్టే మనం FOMO గురించి గట్టిగా మాట్లాడుకోవాలి.
కేవలం వెండిబంగారాలు, స్థలాలే కాదు… జీవితం ప్రతి మలుపులోనూ ఈ ఫోమో ఉంది. స్నేహితుడి పెళ్లికి వెళ్లలేకపోవడం దగ్గర నుంచి కొత్త మాడల్ ఫోన్ కొనలేకపోవడం వరకూ.., ఊళ్లో ఓపెన్ అయిన మాల్కి మిత్రుల కంటే ముందే వెళ్లకపోవడం దగ్గర నుంచి తాజా వార్తలు తెలియకపోవడం వరకూ.. ప్రతి సందర్భంలోనూ ఫోమో ఫోబియానే.

Golds
బలపడిన బలహీనత!
అమెరికన్ రచయిత పాట్రిక్ మెగినిస్ 2004లో ఈ ఫోమో పదాన్ని సృష్టించాడు. అప్పటికే పోటీతత్వం గురించీ, పోలికల గురించీ వేర్వేరు పదాలు, సామెతలు ఉన్నా.. ఇది మాత్రం స్థిరపడిపోయింది. మరింతగా బలపడిపోయింది. కారణం ఇప్పటి పరిస్థితులే!
పోలిక పేచీలు: మనిషి సంఘజీవి కాబట్టి సహజంగానే తన బతుకు ప్రమాణాలని ఇతరులతో పోల్చి చూసుకుంటాడు. దానివెనుక పెద్దగా కారణాలు కూడా ఉండవు. ఇతరుల్ని అనుకరించే ఈ స్వభావాన్ని Bandwagon Effect అంటారు. ఇతరులు ఏదన్నా పనిచేసి… దానివల్ల లాభపడినప్పుడో, గొప్పగా చెప్పుకొంటున్నప్పుడో మనకి వెనుకబడిన భావన కలుగుతుంది.
కొరతల కొలిమి: ఎక్కడో యుద్ధం జరుగుతుంటే.. ఇక్కడ పెట్రోల్ కొరత వస్తుందేమో అన్న భయం. డాలర్ బలహీనపడితే బంగారం రేటు పెరుగుతుందేమో అని బెంగ. లోకం అంతా ఓ కుగ్రామంగా మారిపోయిన తర్వాత.. ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం మన జీవితాల మీద ఉంటున్నది. దాంతో ఎక్కడ ఏం జరిగినా.. దాన్ని ముందుగానే గ్రహించేయాలనీ, ఆ ప్రభావాన్ని లాభసాటిగా మార్చుకోవాలనే తపన.
మాధ్యమాల పోరులో: ఒకప్పుడు సంతోషం కలిగితే దాన్ని నలుగురితో పంచుకోవాలనే మనసు ఉండేది. ఇప్పుడేమో సంతోషకరమైన సందర్భం కలిగితే దాన్ని పంచుకోవడం కాదు, ప్రదర్శించుకోవాలనే యావ కనిపిస్తున్నది. దానికి సోషల్ మీడియా వేదికగా మారుతున్నది. డీపీలు, పోస్టులు, రీల్స్ ద్వారా.. తాము ఎంత తెలివైనవారమో, ఎంత గొప్పగా జీవిస్తున్నామో, ఇతరులకంటే ఎంతలా ముందు ఉంటున్నామో అనే ప్రదర్శనకు వేదికగా సోషల్ మీడియా మారింది. అందుకే సోషల్‌మీడియాకు సమాంతరంగానే ఫోమో ఫోబియాపెరుగుతున్నది.
వస్తుమాయ: టీవీ కావాలా! పదివేలలో దొరుకుతుంది. పది లక్షలు పెట్టినా దొరుకుతుంది. సొంతిల్లు దగ్గర్నుంచీ చెప్పుల వరకూ ఇంతలో ఉండాలి అన్న అంచనాలు లేని వస్తు ప్రపంచంలో ఉంటున్నాం. ఇక్కడ మనం ఎలా ఉండాలో, ఏం కొనాలో మార్కెట్ శాసిస్తున్నది. ప్రకటనలే ప్రభావితం చేస్తున్నాయి. దాంతో ఎప్పుడు ఎక్కడ వెనుకబడుతున్నామో అన్న ఫోమో బెరుకు పుట్టిస్తున్నది.
ఊహాలోకం: కుండలు చేసే వ్యాపారి తను కుండల్ని అమ్మి లక్షాధికారి అయినట్టు కలలు కంటూ.. ఆ కలల్లోనే తేలిపోయి ఒక్కోసారి చేతిలో ఉన్న కుండను కూడా బద్దలుకొట్టుకున్న కథను విన్నాం. ఇప్పుడూ అదే జరుగుతున్నది. మార్కెట్ ఒడుదొడుకులు విపరీతంగా ఉండటం వల్ల.. ఓ వంద గజాలు కొంటే కోటీశ్వరుడిని అయిపోతాను, కిలో బంగారంతో బతుకు మారిపోతుంది… లాంటి ఊహలు మనలో డోపమైన్ అనే హార్మోన్‌ని ఉత్తేజపరుస్తాయి. ఇది కూడా ఓ వ్యసనమే. ఇలాంటి పగటికలలతో ఫోమోని పెంచుకుంటున్నారు.

Phonee
జెన్ జీ బాధితులు
ఇప్పటి జెన్ జీ తరం ఈ ఫోమో బారిన పడటానికి మరిన్ని కారణాలు ఉన్నాయి.
ఎవరన్నా ఏదన్నా కొన్నారు, లాభపడ్డారు, స్థిరపడ్డారు అని తెలియగానే ఈర్ష్యతో రగిలిపోవడం.
ఇలాంటి సవాలక్ష సమస్యలు ఫోమోని చుట్టుకుని ఉంటాయి. అంతేకాదు ఫోమోతో ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అది ‘సరైందా? కాదా?’ అని ఉద్వేగపడటం, అప్పులు చేసి ఖరీదు చేయడం, ఇంతచేస్తున్నా ఇతరుల చర్యలతో పోల్చుకోవడం సర్వసాధారణం.

Booher Devidson
బయటపడాల్సిందే!
చెప్పడం తేలికే! కానీ మనది కాని, మనం అనుకున్నట్టుగా సాగించలేని జీవితాల్లో ఈ ఫోమో నుంచి పూర్తిగా తప్పించుకోలేం. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉంటే దాని ప్రభావాన్ని కొంతైనా తగ్గించుకోగలం.
ట్రిగ్గర్స్ పేలనివ్వద్దు: ఏదన్నా వ్యసనంతో ఉండేవారిని.. ఆ దిశగా రెచ్చగొట్టేవాటిని ట్రిగ్గర్స్ అంటారు! అలాగే సామాజిక మాధ్యమాలు, వాట్సప్ స్టేటస్లు, వెండిబంగారాల ధరలు మనలో ఫోమోను మేల్కొల్పుతాయి.
వాటికి దూరంగా ఉండాల్సిందే!
తొందరపాటు వద్దు: ఇంటర్నెట్ వేగంతో పాటే మనలో వేచి చూసే సహనం కూడా తగ్గిపోతున్నది. నిదానస్తుడు అనే పేరు పడినా సరే, ఈ ఇన్స్టెంట్ కాలంలో ఆర్థికపరమైన నిర్ణయాల కోసం కాస్త సమయం కేటాయించాలి. అది అవగాహన చేసుకునేందుకు, తెలిసినవారిని సంప్రదించేందుకు ఉపయోగపడుతుంది. కనీసం ఓ రాత్రి గడవనిస్తేనే మనసు కుదురుగా ఉంటుంది.
వ్యక్తిగత లక్ష్యాలు: కెరీర్లో ఎలా ఎదగాలి అనుకుంటున్నాం, మనల్ని ఈ లోకం ఎలా గుర్తుంచుకోవాలి, AI లాంటి సవాళ్లకి ఎలా సన్నద్ధంగా ఉండాలి.. ముందుగా ఇలాంటి లక్ష్యాల మీద దృష్టి పెట్టమంటున్నారు నిపుణులు. వ్యక్తిగా విజయవంతమైతే, వస్తువులు వాటికవే వస్తాయి.
మరింత ముఖ్యంగా వందల ఏళ్ల ముందు పెద్దలు చెప్పినా, ఇప్పటి కార్పొరేట్ గురువులు చెప్పినా ఒకటే మాట! దక్కినదానికి కృతజ్ఞత, సాధించినదానికి సంతృప్తి, ప్రతిదీ ఉన్నదున్నట్టు చూసే స్పష్టత, కుటుంబానికి ప్రాముఖ్యత.. ఇవీ మన బతుకు విలువను నిర్ణయించే విషయాలు. ముందుగా అనుసరించాల్సింది వాటినే.
వారికి కాస్త దూరంగా, కాస్త కటువుగా ఉన్నా ఓ విషయం చెప్పుకోవాలి. కొందరి మాటలు ఆడంబరాల చుట్టూనే తిరుగుతుంటాయి. నా జీవితం ఎంత గొప్పగా ఉందో అన్న ప్రదర్శనే వినిపిస్తుంది. దాంతోపాటే ఎదుటివారిని తక్కువ చేసే ప్రయత్నం కూడా! ఆ మాటల ఈటెలు మనలో ఫోమోను రెచ్చగొట్టకముందే… అలాంటి సంభాషణలు, సందర్భాల నుంచి తప్పుకోవడం మేలు.
ఇవన్నీ కుదరకపోయినా ఫర్వాలేదు. లేనివాటి గురించి, అవసరం కానివాటి గురించి మనం న్యూనతలో కూరుకుపోతుంటే ఆత్మీయులతో ఆ బాధను పంచుకోవడంలో తప్పులేదు. మనసుకు దగ్గరైన వారితో, మనల్ని అర్థం చేసుకునేవాళ్లతో ఆ నాలుగు మాటలు చెప్పుకొంటే.. ఫోమో గీమో ఎగిరిపోతుంది. మనిషికి సాటి మనిషితో ఉండే అనుబంధం, ఆసరాలే అన్నింటికంటే గొప్ప అని అర్థమవుతుంది.
పిల్లలకు చెబుదామిలా!
తక్కువ సౌకర్యాలు, ఎదిగేలా పోటీతత్వం, అనారోగ్యం, పేదరికం అన్నీ చూసి వచ్చిన తరాలకు ఫోమో అంత కష్టం కాకపోవచ్చు. కానీ, ఇప్పటి తరానికి అది పెనుభూతమే. అందుకే వారిని కాస్త ఆ దారి నుంచి మళ్లించాలి.

Think
1. వందల గంటలు రుబ్బురోలు చదువులతో, రీళ్లతో గడిచినా ఫర్వాలేదు కానీ ఇప్పటి తరానికి నీతి కథలు అవసరం లేదన్నది ఓ అభిప్రాయం. ఆ లోటును ఇంట్లోనే భర్తీ చేయవచ్చు. సువర్ణష్టీవి, పంచతంత్రం లాంటి కథలు వాళ్లకు ఆసక్తిగా ఉంటూనే అత్యాశ, ప్రలోభాల గురించి మనసులో చెదరని ముద్ర వేస్తాయి.
2.పరీక్షల్లో ఫెయిల్ అయినా, నచ్చిన మనిషి కాదన్నా, ఆఖరికి బోర్ కొడుతున్నా జీవితాన్ని అంతం చేసుకునేంత తొందరపాటు ఇప్పటి తరానికి. బతికే ప్రతి క్షణం ఎంత విలువైందో తెలియకపోవడమే ఇందుకు కారణం. అందుకే వాళ్ల మనసులో FOMOని తొలగించి YOLOని నిలబెట్టాలి. అంటే You Only Live Once. జీవితపు విలువ దాని చుట్టూ ఉండే వస్తువులు, పోలికలతో కాదు.. స్నేహం, చిరునవ్వు, లక్ష్యం, ఆరోగ్యం, శ్రమలాంటి కొలతలేని విలువల్లో ఉన్నాయని నేర్పాలి. అర్థమయ్యేంతవరకూ చెప్పాలి.
3.‘2000 సంవత్సరంలో మంచి మార్కులు వచ్చినందుకు నాకు 8 గ్రాముల బంగారు మెడల్ వచ్చింది. దాన్ని నాలుగువేలకి అమ్మి నేను కోచింగ్ ఫీజ్ కట్టాను. ఇప్పుడు అదే మెడల్ 1.20 లక్షలు విలువ చేస్తుంది. కానీ దానికంటే.. నేను స్థిరపడే అర్హత ఇచ్చిన కోచింగ్ విలువే ఎక్కువ అనుకుంటాను. అందుకే బంగారం, వెండి ధరల గురించి కాకుండా మీ నైపుణ్యాలను మెరుగుపెట్టుకునే ప్రయత్నం చేయండి’ అంటారు ఐఐఎంలో చదివి విజయవంతమైన స్టార్టప్ నడుపుతున్న అబిద్ హుసేన్. ఈ మాటలకు ఇంకేం వివరణ కావాలి! విద్య, సంస్కారం ఎంత విలువైనవో పిల్లలకు ముందు తెలియచేయాలి.
ఇలాంటివే మరికొన్ని!
ఫోమో ప్రచారంలోకి రావడంతో… అలాంటివే మరికొన్ని పదాలు కూడా మొదలయ్యాయి. వాటిలో తరచూ వినిపించేవి FOBO- Fear Of a Better Option. ఫోమోతో పాటే మొదలైన పదమిది. కళ్ల ముందు సవాలక్ష ఎంపికలు కనిపిస్తుంటే… అసలు ఆ ఉత్పత్తి అవసరమా కాదా అన్న నిర్ణయం కాకుండా, వాటిలో ఏది కొనాలి అన్న అయోమయంలో పడిపోతారు.
FOMOMO- Fear Of the Mystery Of Missing Out. మొబైల్ ఫోన్ కానీ నెట్ కానీ అందుబాటులో లేకపోవడం వల్ల సోషల్ మీడియాలో ఎవరు ఏం పోస్ట్ చేసేస్తున్నారు, వాళ్లేమన్నా సుఖపడిపోతున్నారా, మనమేమన్నా వెనకబడిపోతున్నామా అనే భయం!
FOJI- Fear Of Joining In. నలుగురితోనూ కలుద్దాం అంటే.. కలుపుకొంటారో లేదా, ఎవరి పోస్టు గురించైనా కామెంట్ చేద్దామంటే ఎలా స్పందిస్తారో, మన అభిప్రాయాలే పోస్ట్ చేద్దామంటే ఎలాంటి విమర్శలు వినిపిస్తాయో లాంటి భయాలే ఇవి.
FOBIA- Fear of Being Ignored Altogether. ఆన్లైన్లో లేకపోతే అసలు తనని మనిషిగానే గుర్తించరు, గుర్తుంచుకోరు అనే భయంతో నామమాత్రంగా అయినా సామాజిక మాధ్యమాల్లో ఉండటం.
ROMO- Reality of Missing Out. కొవిడ్ సమయంలో పుట్టిన పదమిది. వెనకబడుతున్నామేమో, వదిలేస్తున్నామేమో అనే ఫోమో ఓ భ్రమ అయితే రోమో ఓ వాస్తవం. నిజంగానే జీవితంలో విలువైన స్వేచ్ఛ, ప్రయాణాలు, బంధాలు, ఆరోగ్యం లాంటివి కోల్పోతే కలిగే భావనే ఈ రోమో!
JOMO- Joy of Missing Out. ఒకరకంగా ఇది ఫోమోకి వ్యతిరేకం. డిజిటల్ పరికరాలు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ.. నిజమైన ప్రపంచానికి తగినంత దగ్గరగా ఉండటమే.

హెచ్చరించే పరిశోధనలు
ఫోమో గురించి చాలా పరిశోధనలే జరిగాయి.
వాటిలో కొన్ని ఆసక్తికరమైనవి..
వయసుతో పనిలేదు: వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ నాలుగువందల మంది అభిప్రాయాలను సేకరించాక, ఫోమో కేవలం జెన్ జీని మాత్రమే కాదు.. ఏ వయసువారినైనా ప్రభావితం చేస్తున్నదని తేల్చారు.
డిజిటల్ ఫోమో: ఇప్పుడు పని అంతా వాట్సాప్, మెయిల్స్, జూమ్ కాల్స్ తోనే నడుస్తున్నది. దాంతో ఏ సందేశం ఎప్పుడు దాటిపోతోందో అనే భయం కలుగుతున్నది. రాత్రింబవళ్లు ఫోన్లో ఏ చిన్న శబ్దం వచ్చినా.. అది ఏ అధికారి నుంచి వచ్చిన తాఖీదో అనే భయం తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తున్నదట. నాటింగమ్ విశ్వవిద్యాలయం పరిశోధన ఇది.
వ్యసనాలకు దారితీస్తుంది: ఇతరుల దృష్టి నుంచి తనని తాను చూసుకునే టీనేజ్ వయసులో ఫోమో ప్రభావం ఎక్కువే. అయితే ఇది హద్దులు మీరినప్పుడు వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నదని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధన చెబుతున్నది. ఫోమోను దాటే ప్రయత్నంలో దొంగతనం, మద్యం, డ్రగ్స్, గొడవలు లాంటి సమస్యలకు లోనవుతున్నారని నిర్ధారించింది.
భ్రమ కాదు: సోషల్ మీడియాలో ఇతరులను చూసి తమ జీవితాలను అంచనా వేసుకునే ఫోమో తాత్కాలికం కాదనీ, అది కుంగుబాటుకీ, తన జీవితం వృథా అనే అసంతృప్తికీ దారితీస్తున్నదని అనేక శోధనలు చెబుతున్నాయి.
లోకమే అతలాకుతలం: ఫోమో వ్యక్తిగతం కాదు. అది ఓ సామాజిక రుగ్మత. ప్రతి ఒక్కరినీ పరుగుపెట్టించే యంత్రం. ఇటీవల మార్కెట్లు ఒక్కసారిగా ఎగుడు దిగుడులకు లోనవడానికి కారణం ఇదేనని రిచర్డ్ థాలర్ లాంటి నోబెల్ గ్రహీతలైన ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
…? కె.ఎల్.సూర్య