హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): చారిత్రక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) విద్యా శిఖరంగా ఎదిగింది. విద్యా ప్రభను ఖండాంతరాలకు చాటుతున్నది. తన పూర్వ విద్యార్థులు ప్రపంచఖ్యాతి గడించడం వెనుక హెచ్‌పీఎస్ బలమైన పునాది వేసింది. హెస్పీఎస్ ఒడిలో విద్యాబుద్ధులు నేర్చిన విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీలకు సీఈవోలుగా కొనసాగుతున్నారు. పలు సంస్థలను అధిపతులుగా, మరికొన్ని సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ.. భారతీయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌లో 1923లో హైదరాబాద్ స్టేట్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను నెలకొల్పారు.
1951 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధనను కొనసాగిన్నది. ఈ ఏడాది పొడవునా పాఠశాల శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుండగా, ఈ నెల 24 నుంచి 27 వరకు ముగింపు వేడుకలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులైన పలువురు ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, బిజినెస్ మాగ్నెట్లు, ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రికెటర్లు, న్యాయవాదులు హాజరుకానున్నారు. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలకు అధిపతులుగా తమ పాఠశాల పూర్వ విద్యార్థులు కొనసాగడం ఎంతో గర్వకారణమని హెచ్‌పీఎస్ వైస్ ప్రిన్సిపాల్ అమృత చంద్ర తెలిపారు. హాజరయ్యే వారిలో కొందరు ప్రముఖుల అభిప్రాయాలు..
హెచ్‌పీఎస్ చూపిన ప్రభావం పూర్వ విద్యార్థుల జీవితాలపై ప్రతిబింబిస్తున్నది. స్కూల్లో నేను గడిపిన కాలం ఎంతో మధురమైన జ్ఞాపకాలుగా ఉన్నాయి. బ్యాక్ఫీల్డ్లో క్రికెట్ ఆడటం, అకడమిక్స్ నా జీవితాన్ని ఒక ఆకృతిలో తీర్చిదిద్దడంలో కీలకం. నేటికీ అందరికీ మార్గనిర్దేశనం చేస్తుందని చెప్పాలి. జీవితంలో అనుకున్నది సాధించడానికి నాకు విశ్వాసాన్ని, దృక్పథాన్ని పెంపొందించింది.
-సత్యనాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో (1984 బ్యాచ్)
పాఠశాల నాకు అన్ని రంగాలను పరిచయం చేసింది. అన్ని క్రీడల్లో, ముఖ్యంగా క్రికెట్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది. నేను రాష్ట్ర అండర్-19కు వెళ్లాను. మాలో కొందరు ఇంగ్లాండ్‌లో పర్యటించారు. ఇది నాపై, నా సామర్థ్యాలపై నమ్మకం పెంచింది. 32 ఏండ్ల పోలీస్ సర్వీస్‌లో మంచి స్థానంలో నిలవడానికి తోడుగా ఉండింది. మానవత్వాన్ని నేర్పింది. టీచర్లు నేర్పిన పాఠ్యాంశాలు నన్ను ఎంతో ఉత్తమంగా తీర్చిదిద్దాయి. హెచ్‌పీఎస్ మధుర జ్ఞాపకాలను మరువలేం.
-సీవీ ఆనంద్, సీనియర్ ఐపీఎస్ (1986 బ్యాచ్)
పాఠశాల పుస్తకాల పురుగులను సృష్టించలేదు. వ్యక్తిత్వాన్ని సృష్టించింది. మనకు ఆసక్తి ఉన్న రంగంలో అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వీలు కల్పించింది. ఇదే స్కూల్ గొప్పతనం. ఇంతగొప్ప బలమైన సంస్కృతి శాశ్వతంగా భద్రపర్చి మరెంతో బలపడాలని నేను నమ్ముతున్నాను.
-హరిప్రసాద్, అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్ (1982బ్యాచ్)
పాఠశాలలో అద్భుతమైన సంప్రదాయంతోపాటు వర్తమానం ఉన్నది. ఉజ్వల వర్తమానం కోసం చేయిచేయి కలపాలి. అప్పుడే ఏదైనా కార్యరూపం దాలుస్తుంది. దేశ రాజ్యాంగ తత్వానికి అనుగుణంగా పౌరులను తీర్చిదిద్దడం సాధ్యం అవుతుంది. పాఠశాల కీర్తి పెరుగడంతోపాటు మనకూ సార్థకత ఉంటుంది.
-శ్రీరాం పంచు, సీనియర్ న్యాయవాది, మద్రాసు హైకోర్టు (1969 బ్యాచ్)
నాది 1976 బ్యాచ్. స్కూల్ 50వ వార్షికోత్సవంలో నేను పాఠశాలలోనే ఉన్నాను. శతాబ్ది ఉత్సవాల్లో భాగం కావడం ఒక ఉత్తేజకరమైన క్షణం. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా మనమందరం సహకరించాలని ఆశిస్తున్నాను.
-సయ్యద్ అక్బరుద్దీన్, కౌటిల్య స్కూల్ డీన్, యూఎన్ మాజీ భారత ప్రతినిధి
ఇక్కడ చదివి ఎంతో కాలం గడిచింది. కానీ నేను ఇప్పటికీ ప్రతిదీ గుర్తుపెట్టుకున్నాను. ఇది అద్భుతమైన స్వేచ్ఛను అందించిన ప్రాంతం. అధ్యాపకులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలిస్తేనే జీవితం అని నమ్ముతాను. క్రీడ, స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవాల్లో కవాతు ఎంతో ఆకట్టుకునేది. ప్రస్తుతం దేశానికి గర్వకారణమైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థుల పేర్లు తరుచుగా వింటూనే ఉన్నాం.
– నాగార్జున అక్కినేని, ప్రముఖ నటుడు (1976 బ్యాచ్)
వారంపాటు జరిగే శతాబ్ది వేడుకలకు నా కుటుంబం, పిల్లలతోపాటు వచ్చేందుకు ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను. స్నేహితులతోపాటు నాటి జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు వస్తున్నాను.
-శైలేశ్ జెజురికర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రోక్టర్ అండ్ గాంబుల్ సంస్థ(1981 బ్యాచ్)
నేను అవుట్ గేట్ నుంచి బయటకు వెళ్లి చాలా కాలమైంది. కానీ నా మనస్సు మాత్రం ప్రతిసారి నన్ను వెనక్కి లాగుతూనే ఉండేది. పదే పదే లోపలికి వస్తూ.. వైఎంసీఏ నుంచి వచ్చే బస్సు మమ్మల్ని తీసుకొచ్చి పాఠశాల ప్రాంగణంలో దించివెళ్తున్నట్టు ఊహించుకొనేది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ ఉన్నది. ఇప్పటికీ మేము పాఠశాలలో ఉన్నట్లుగానే మాట్లాడుకుంటాం. (1978వ బ్యాచ్)
– హర్ష భోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత
నేను 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థిని. హెచ్‌పీఎస్ నుంచి 30 ఏండ్ల క్రితం గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. నాకు చదువు చెప్పి, నన్ను ప్రేరేపించిన ఉపాధ్యాయులు, నా సహచరులు, స్నేహితులను మర్చిపోలేను. పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనే వాడిని. విజయనగర్ హౌస్‌లో సభ్యుడిగా ఉండటం అనుభూతినిచ్చింది.
-శంతను నారాయణ్, అడోబ్ సంస్థ సీఈవో
నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు బాల్సా ైగ్లెడర్ను తయారు చేసి విసిరా. అది మా సైన్స్ టీచర్ జయనాథ్ తలుపు తట్టింది. అంతే ఆయన బైటకొచ్చి చూశారు. నేను దానితో ఆడుకోవడం చూసి.. ఈ విభాగంలో మీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. నేను అవును అన్నాను. అప్పుడే హెచ్‌పీఎస్‌లో ఏరోమోడలింగ్ సెటప్ చేయడంలో సహకారం అందించారు. హెచ్‌పీఎస్‌లో గొప్ప ఫ్యాకల్టీ, ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. విద్యార్థుల కలలను సాకారం చేసుకోవడానికి హెచ్‌పీఎస్ తన శక్తిమేరకు ప్రత్నిస్తుంది.
-సతీశ్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ జాన్సన్ స్పేస్ సెంటర్ (1984 బ్యాచ్)