హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌కుమార్ కచ్చి మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హరితప్లాజా హోటల్లో ఆయనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఘన స్వాగతం పలికారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కమిషనర్‌తో కచ్చి భేటీ అవుతారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, స్థానిక సంస్థల పనితీరును తెలుసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 18న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని కచ్చి దర్శించుకొంటారు. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట తదితర చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించనున్నారు.