హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాకే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన ‘రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్’ క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదని, నగరాన్ని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవడమే క్యాబినెట్ లక్ష్యమని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్‌రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేస్తే మంచిదని అన్నారు. చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సూచించారని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
యూడీఎల్ (అన్డెవలప్డ్ ల్యాండ్) పాలసీ కింద భూములను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి అభివృద్ధి చేసుకొనే ఆలోచన చేయాలని సూచించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్లతో చర్చించి హిల్ట్ పాలసీ అమలును వేగవంతం చేయాలని చెప్పారు. హిల్ట్ పాలసీ గైడ్‌లైన్స్ రూపొందించే ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధుల ఆలోచనలకు చోటు కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. పాలసీ అమలుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని, ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కుల్లో పరిశ్రమలకు ఉన్న విద్యుత్తు, మంచినీరు వంటి వసతులను ఔటర్ రింగ్‌రోడ్డు అవతల ఏర్పాటు చేసుకునే పరిశ్రమలకు షిఫ్ట్ చేసేందుకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌రెడ్డి సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.
‘మే’లో సవరించిన భూముల మార్కెట్ విలువల అమలు
రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలోని భూముల వివరాలు సేకరించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్నవి, ఆక్రమణకు గురైనవి, శాఖల అందుబాటులో ఉన్న వాటి వివరాలు సేకరించాలని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సమాచారం సేకరించాలని అన్నారు. మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలుచేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సబ్‌కమిటీ ఆదేశించింది. రిసోర్స్ మొబిలైజేషన్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలను అధికారులు స్పష్టంగా అమలుచేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, అశ్రద్ధ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్‌కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.