హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : అనుమతుల్లేకుండా ఇంజినీరింగ్ అడ్మిషన్లు కల్పిస్తున్న ఫేక్ కాలేజీలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కొరడా ఝళిపించనున్నది. యూజీసీ, ఏఐసీటీఈ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు అందిన నాలుగు విద్యాసంస్థలకు నోటీసులు జారీచేయనున్నది. ఈ సంస్థలు ఐటీ కారిడార్‌లో నడుస్తున్నాయని ఫిర్యాదుచేశారు. ఈ విద్యాసంస్థలు కొన్ని డీమ్డ్ టు బీ వర్సిటీలతో ఎంవోయూలు కుదుర్చుకుని సీఎస్ఈ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నాయని, క్లాసులను సైతం నిర్వహిస్తున్నట్టు మండలికి ఫిర్యాదులందాయి. ఎంవోయూలు కుదుర్చుకొని, కొలాబరేషన్లో అడ్మిషన్లు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. ఇవి కాలేజీలా? కన్సల్టెన్సీలా? వేటి అధారంగా అడ్మిషన్లు తీసుకుంటున్నాయనే అంశాలపై స్పష్టతనివ్వాలని కోరుతూ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది.
విద్యార్థులతో పనులు చేయించడం దుర్మార్గం ; అద్దె భవనాల సమస్యను తక్షణమే పరిష్కరించాలి : జాన్‌వెస్లీ
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 240 గురుకులాల్లో 1200 మంది అసిస్టెంట్ కేర్‌టేకర్ పోస్టులను తొలగించి, విద్యార్థులతో టాయిలెట్స్, తరగతి గదులు, విద్యాసంస్థ ఆవరణలను శుభ్రం చేయించాలని నిర్ణయించడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుడు గురుకులాల మెయింటెనెన్స్, స్వీపింగ్, శానిటేషన్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించేదని, ప్రస్తుతం వాటిని ప్రభుత్వం నిలిపివేడయం దారుణమని మండిపడ్డారు. బాధ్యతాయుత స్థానాల్లో పనిచేస్తూ.. విద్యార్థుల గురించి అనుచితంగా మాట్లాడిన గురుకుల కార్యదర్శి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 662 గురుకులాల అద్దె భవనాలకు రూ.215 కోట్లు అద్దె చెల్లించకపోవడంతో భవన యజమానులు తాళాలు వేసుకున్నారని, విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.