Chalo Secretariat | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఓవైపు నిరుద్యోగులు, మరోవైపు విద్యార్థి సంఘాలు, ఇంకోవైపు బీసీ నేతల ముప్పేట ముట్టడితో సచివాలయం, చుట్టుపక్కల ప్రాంతాలు సోమవారం దద్దరిల్లాయి. డీఎస్సీ వాయిదా, జాబ్ క్యాలెండర్ విడుదల, గ్రూప్స్ పోస్టుల పెంపు డిమాండ్లతో నిరుద్యోగులు, రాష్ట్రంలో బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ జనసభ నేతలు, రూ.8వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు.
వరుస ధర్నాలు, దిక్కులుపిక్కటిల్లేలా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సచివాలయం ప్రాంతం హోరెత్తింది. వేలాది మంది కదంతొక్కడంతో సెక్రటేరియట్ వద్ద రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముట్టడి నేపథ్యంలో పోలీసులు సచివాలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టారు.
నిరుద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు సచివాలయానికి వచ్చే అన్ని మార్గాల్లో సుమారు 100 మీటర్ల మేర వందలాదిమంది సివిల్, స్పెషల్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మెహరించారు. అష్ట దిగ్బంధాన్ని ఛేదించుకుంటూ ఆయా సంఘాల నాయకులు, విద్యార్థులు సెక్రటేరియట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాజారాం యాదవ్‌తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలిపినవారిని వాహనాల్లోకి ఎక్కించి పోలీసుస్టేషన్లకు తరలించారు.
డీఎస్సీ వాయిదా వేయాల్సిందే..
డీఎస్సీ వాయిదా వేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలవాలని, గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ‘వీ వాంట్ జస్టిస్’, ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సచివాలయం ఆగ్నేయం గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు నల్లపోచమ్మ గుడి వైపు నుంచి కొందరు నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి యత్నించగా అరెస్ట్ చేసి, పోలీస్స్టేషన్లకు తరలించారు. ముట్టడికి ఓయూ నుంచి బయలుదేరిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్, ఇతర నాయకులను ఉప్పల్‌లో అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి ల్రైబరీ నుంచి నిరుద్యోగులు ర్యాలీ తీసేందుకు ప్రయత్నిచంగా పోలీసులు అడ్డుకున్నారు.
కులగణన చేపట్టాలి
రాష్ట్రంలో బీసీ కులగణన వెంటనే చేపట్టాలనే డిమాండ్‌తో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను ముం దస్తు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సెక్రటేరియట్ వద్ద రాజారాం యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయం ముట్టడికి ర్యాలీగా వస్తుండగా అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు సచివాలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నల్లపోచమ్మ గుడి నుంచి సచివాలయంలోకి వచ్చే రోడ్డును పూర్తిగా మూసేశారు. చుట్టూ అదనంగా బారికేడ్లు పెట్టి అదనపు బలగాలను మోహరించారు. నిరసనకారులను పోలీస్స్టేషన్లకు తరలించేందుకు పదుల సంఖ్యలో వాహనాలను సిద్ధంగా ఉంచారు. వచ్చినవారిని వచ్చినట్టే అరెస్ట్ చేస్తూ ఠాణాలకు తరలించారు. సచివాలయం వైపు వచ్చే మార్గాల్లో 100 మీటర్ల వరకు ప్రధాన కూడళ్లలో పోలీసులు గుంపులుగా పహారా కాశారు.
ప్రభుత్వ పతనం ప్రారంభం: రాజారాంయాదవ్
ఖైరతాబాద్: సెక్రటేరియట్ వద్ద ధర్నాలో రాజారాంయాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విదించినా నిరుద్యోగుల సమస్య పరిష్కారమయ్యేదాకా పోరాడుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రమంతటా అరెస్టుల పర్వం
రాష్ట్రమంతటా ఆదివారం అర్ధరాత్రి నుంచే నిరుద్యోగ, విద్యార్థి, బీసీ సంఘాల నేతల అరెస్టులు కొనసాగాయి. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగల శ్రీనివాస్‌ను నర్సంపేటలో, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాయంచు నాగరాజును ములుగులో అరెస్టు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహా మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్‌పల్లి, దామరచర్ల, శాలిగౌరారం, తిర్మలగిరిసాగర్, త్రిపురారం, మాడ్గులపల్లి, సంస్థాన్ నారాయణపురం, మోత్కూర్, సూర్యాపేట, నాగారం, భీమారం, యాదాద్రిభువనగిరి, గుండాల, అడ్డగూడూర్, భూదాన్‌పోచంపల్లి, నడిగూడెం, తుంగతుర్తితో పాటు పలుచోట్ల వివిధ సంఘాల నేతల అరెస్టులు కొనసాగాయి.