బుల్లెట్ రైలు పేరిట భూముల వేట!
ఏదైనా ప్రాజెక్టును మొదలు పెట్టాలంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తా యి? ముందుగా ఆ ప్రాజెక్టు లక్ష్యం, సాధ్యాసాధ్యాలపై నిపుణులతో అధ్యయనం చేయించి, సమగ్ర నివేదికను తెప్పించుకుంటాయి.
- అనుమతులు రాకముందే కాంగ్రెస్ సర్కార్ హడావుడి
- డీపీఆర్ లేకుండానే 1,100కు పైగా ఎకరాలపై కన్ను
- బహదూర్‌గూడ, రాయకుంట, గొల్లపల్లి ఖుర్ద్, సయ్యద్‌గూడ భూముల కోసం నోటిఫికేషన్
- గతంలో హైకోర్టుకు బాధితులు.. ధర్మాసనం స్టే
- రేవంత్ సర్కార్ వ్యవహారశైలిపై విమర్శల వెల్లువ
హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టును కేంద్రం ప్రతిపాదించింది. అయితే దీనికి స్పష్టమైన అనుమతుల్లేవు. కారిడార్లపై క్లారిటీ రాలేదు. మార్గాలు ఖరారు కాలేదు. డీపీఆర్ సిద్ధం కాలేదు. కానీ భూములంటేనే యావ పెంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవేవీ అక్కర్లేదు. అనుమతులు రాకముందే 1100 ఎకరాలపై కన్నేసింది. శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ, రాయకుంట, గొల్లపల్లి ఖుర్ద్, సయ్యద్‌గూడ గ్రామాల్లో భూముల సేకరణకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రేవంత్ సర్కార్ తీరును తప్పుపడుతూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఏదైనా ప్రాజెక్టును మొదలు పెట్టాలంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తా యి? ముందుగా ఆ ప్రాజెక్టు లక్ష్యం, సాధ్యాసాధ్యాలపై నిపుణులతో అధ్యయనం చేయించి, సమగ్ర నివేదికను తెప్పించుకుంటాయి. ఆ తర్వాత ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను (పీపీఆర్), దానికి అనుగుణంగా డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను (డీపీఆర్) సిద్ధం చేస్తాయి. దాని తర్వాత సంబంధిత శాఖ నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటాయి. ప్రాజెక్టు అంచనా వ్య యం తదితర వివరాలను పొందుపరుస్తాయి. ప్రాథమిక అనుమతులు వచ్చాక, సంబంధిత శాఖ సూచనల ప్రకారం.. ప్రాజెక్టు నిర్మించే మార్గాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తాయి. క్షేత్రస్థాయిలో భూ యజమానులు, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పరిహారం సంబంధిత విషయాలపై చర్చిస్తాయి. కానీ రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో ప్రాథమిక నిబంధనలను కూడా పట్టించుకోకుండా, నేరుగా భూముల వేటకు దిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అలైన్మెంట్ ఖరారు కాకుండానే..
హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణె నగరాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం హైస్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించింది. అయితే దీనికి కేంద్రం నుంచి స్పష్టమైన అనుమతులు రాలేదు. మూడు కారిడార్లకు సంబంధించిన మార్గాలు ఇంకా ఖరారు కాలేదు. డీపీఆర్ కూడా సిద్ధం కాలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల భూములను భారీగా సేకరించేందుకు అడుగులు వేస్తుండటం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ, రాయకుంట, గొల్లపల్లి ఖుర్ద్, సయ్యద్‌గూడ గ్రామాల్లో 1,100 ఎకరాలకు పైగా భూములను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. బుల్లెట్ రైలు ప్రయాణించే అలైన్మెంట్ ఖరారు కాకుండానే, లక్షిత గ్రామాల్లో భూసేకరణ చేపట్టడమేందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
లేఖలో అలా.. వాస్తవం ఇలా!
అక్టోబర్ 30న సీఎం రేవంత్‌రెడ్డి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు రాసిన లేఖతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మూడు కారిడార్ల ప్రతిపాదిత మార్గాలకు సంబంధించి గత మే నెలలో నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిందని, ఆయా మార్గాలపై అంగీకారం కోరిందని రేవంత్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయా మార్గాలను తాను స్వయంగా పరిశీలించి, వాటిలో కొన్ని మార్పులను సూచించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా శంషాబాద్‌లో హైస్పీడ్ రైలు స్టేషన్ (హెచ్ఎస్ఆర్)తోపాటు ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలను కేటాయించినట్టు వెల్లడించారు. దీనికి అదనంగా ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ పేరుతో మరో 1,127 ఎకరాలను గుర్తించినట్టు వివరించారు. ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ తుది అనుమతి ఇచ్చిన తర్వాతే భూసేకరణ, అటవీ అనుమతులు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాల మార్పులు, మాస్టర్‌ప్లాన్‌లో కారిడార్ల మార్పులు-చేర్పులు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం పేర్కొన్నారు. అయితే, లేఖలో పేర్కొన్నదానికి విరుద్ధంగా ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్, రైల్వే మంత్రిత్వ శాఖ తుది ఆమోదం లభించకముందే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది.
కోర్టును ఆశ్రయించిన బాధితులు
బుల్లెట్ ట్రైన్ హబ్ పేరిట బహదూర్‌గూడలోని అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడానికి గతంలో పోలీసు బలగాలతో అధికారులు ప్రయత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే తరహాలో ఇతర భూములకు కంచె వేసేందుకు ప్రయత్నించగా, న్యాయస్థానం యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిందని సమీప గ్రామాల ప్రజలు చెప్తున్నారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం భూమి సేకరిస్తే కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
మూడు రోజుల్లోనే మినహాయింపు జీవో!
భూసేకరణ ఫైలు కదిలిన వేగంపైనా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2026 ఆగస్టు 14న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 1,127 ఎకరాల భూసేకరణకు రవాణా శాఖ అనుమతి కోరారు. అదే సమయంలో తప్పనిసరిగా నిర్వహించాల్సిన ‘సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ను ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడం వివాదంగా మారింది. ఆ తర్వాత సంబంధిత చీఫ్ ఇంజినీర్ ఒక్కరోజులోనే ప్రభుత్వానికి ఫైలు పంపించి, అవసరమైన మినహాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆగస్టు 17న రవాణా శాఖ జీవో ఎంఎస్ నంబర్ 42ను జారీ చేసింది. ప్రతిపాదిత భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు ఇచ్చింది.
అయితే, ఈ జీవోలో ప్రాజెక్టు డీపీఆర్, వ్యయ అంచనా, ప్రాజెక్టు ప్రయోజనాల విశ్లేషణ, అసలు 1,127 ఎకరాల భూమి ఎందుకు అవసరం? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి మినహాయింపు ఎందుకు ఇవ్వాలి? వంటి అంశాలపై స్పష్టమైన వివరాలు లేవని బాధితులు చెప్తున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ తొలివారంలో కలెక్టర్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. రైతులు పరస్పర అంగీకారంతో భూములు ఇచ్చేందుకు సమ్మతి తెలుపాలని కోరారు. భూములకు ప్రభుత్వం ఎంత ధర చెల్లిస్తుందన్న విషయాన్ని మాత్రం నోటిఫికేషన్లో వెల్లడించలేదు. దీంతో బాధితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్నది. కాగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పేరుతో రైతుల భూములను గుంజుకోవడానికే ప్రభుత్వం ఈ తరహా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

