ధాన్యం రైతుకు యాప్ దగా!
మొన్నటిదాకా ఎల్ నినో సాకుతో సాగునీటికి గండికొట్టి రైతుల నడ్డివిరిచిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఏకంగా ధాన్యం బోనస్ ఎగ్గొట్టాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది.
- బోనస్ ఎగవేతకు సర్కార్ ఉద్దేశపూర్వక జాప్యం
- కొనుగోలు కేంద్రాలు తెరిస్తే నిర్వహణ భారంతో
- పాటు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుందని జాప్యం
- ఇంతవరకు వడ్లగింజ కూడా కొనని ప్రభుత్వం
- నెల రోజులుగా కల్లాలు, కేంద్రాల్లోనే ధాన్యం
- సర్కార్ తీరుతో వడ్లరాశులు దళారులపాలు
- విధి లేక అగ్గువకు అమ్ముకుంటున్న రైతులు
వరంగల్ ప్రతినిధి/కరీంనగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : మొన్నటిదాకా ఎల్ నినో సాకుతో సాగునీటికి గండికొట్టి రైతుల నడ్డివిరిచిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఏకంగా ధాన్యం బోనస్ ఎగ్గొట్టాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఏఐ ఆధారిత యాప్ పేర్కొన్నట్టు కేంద్రాలు నడిపితే రైతుకు రూ.500 ఇవ్వాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగానే ధాన్యం కొనకుండా జాప్యం చేస్తున్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే స్పష్టమవుతున్నది. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రంలో నిర్దేశిత మౌలిక సౌకర్యాలు ఉండాలి. టార్పాలిన్లు, గన్నీ సంచులు, ధాన్యం నిల్వ స్థలాలు, కేంద్రం వద్ద రక్షణ గేటు, ధాన్యం రక్షణకు జాగ్రత్తలు, తేమశాతాన్ని నిర్ధారించే పరికరం, తూర్పార యంత్రం, వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు తదితర సౌకర్యాల ఫొటోలు యాప్‌లో అప్లోడ్ చేస్తేనే అనుమతి లభిస్తుంది.
మొత్తం 16 ప్రశ్నలకు సమాధానాలను యాప్‌లో నమోదు చేస్తేనే కొనుగోలు కేంద్రం నిర్వహణకు అనుమతి లభిస్తుంది. లేకపోతే కొనుగోలు కేంద్రం లేనట్టేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్దేశిత సౌకర్యాలు కల్పించాలంటే ఖర్చుతోపాటు అందుకు అవసరమైన సాంకేతిక నిపుణుత అవసరం. అవన్నీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమకూర్చుకునే అవకాశాలు తక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే రైతు నుంచి కొనుగోలు చేసిన ప్రతీ కింటాల్కు బోనస్ రూ.500 చెల్లించాల్సి వస్తుందని, ఆ బోనస్ ఎగవేతకు దగ్గరి మార్గమే కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక ముసుగు తొడిగి 16 రకాల ప్రశ్నలకు సమాధానాలు కావాలని కోరుతుందనే ఆరోపణలున్నాయి.
దీంతో పంట చేతికొచ్చి నెల రోజులు గడిచినా ఇప్పటికీ వడ్లు కొనేవారు లేక అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడక్కడ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు అట్టహాసంగా కొనుగోలు ప్రారంభిస్తున్న కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక్క గింజ ధాన్యం కొన్నది లేదు. ఇప్పటికే అకాల వర్షాలతో కొన్నిచోట్ల తడిసి ధాన్యం మొలకెత్తుతుండగా, అధికారులు మాత్రం రేపూమాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇదే అదనుగా దళారులు ఇష్టానుసారం ధరలు తగ్గించడంతో విధి లేక రైతులు తక్కువ ధరకే అమ్ముకొని నష్టపోవాల్సి వస్తున్నది. తమ రెక్కల కష్టాన్ని దళారుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నెల రోజులుగా కేంద్రాల్లోనే మకాం
సాధారణంగా అక్టోబర్ మొదటి వారంలోనే కోతలు ప్రారంభిస్తారు. రెండో వారంలో ముమ్మరమవుతాయి. ఆయకట్టు ప్రాంతంలో ముందు, ఆయకట్టేతర ప్రాంతంలో కొంత వెనుక కోతలు ఉంటాయి. ఈసారి కూడా అలాగే జరిగింది. దీనికి అనుగుణంగా కోతల వెంట కొనుగోలు అన్నట్టు ముందస్తు కోతలు వచ్చిన ప్రాంతాల్లో అధికారులు కేంద్రాలు ప్రారంభించి అక్టోబర్ రెండో వారం నుంచే కొనుగోళ్లు మొదలు పెట్టేవారు. కానీ ఈసారి ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కరీంనగర్, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి తదితర మండలాల్లో అక్టోబర్ మొదటి వారంలోనే కోతలు జరిగాయి. కేంద్రాలకు ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం వచ్చింది. నెల రోజుల నుంచి రైతులు తమ ధాన్యాన్ని ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం తేమ 17శాతం వచ్చే వరకు ఆరబెట్టుకొని ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు 310 కేంద్రాలను తెరిచినా ఒక్క క్వింటా ధాన్యం కూడా ప్రభుత్వం కొనలేదు. ఒకవైపు అకాల వర్షాలు కురిసి పూర్తిగా ఎండిన ధాన్యం తడిసిపోతున్నది. కొందరివి మొలకలు కూడా వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. ఇక వరంగల్ జిల్లావ్యాప్తంగా 201 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అవి ప్రారంభం కాలేదు.
దళారులు చెప్పిందే ధర..
కోతలు మొదలైన తర్వాత దళారులు సన్న రకానికి రూ.3,100, దొడ్డు రకానికి రూ. 2,300 ఆపైనా కొనుగోలు చేస్తున్నారని అధికారులే ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు. ఈ పరిస్థితి కొన్నిచోట్లకే పరిమితమైంది. కొన్నిచోట్ల మాత్రమే దళారులు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోళ్లు జరిపారు. అందులో ఎక్కువగా సన్నాలు తీసుకున్నారు. కానీ, అధికారులు చెప్పినట్టుగా క్వింటాలుకు రూ. 3,100 కాకుండా రూ. 2,900కు తక్కువే కొనుగోలు చేశారు. దళారులు ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతున్నారని ప్రచారం చేసిన అధికారులు ఇప్పుడు వారి కొనుగోలు లక్ష్యాన్ని 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించుకున్నారు. ఇప్పుడు 2.50 లక్షలే కొనుగోలు చేస్తామని స్పష్టంగా చెప్తుండటం గమనార్హం. ఇక నెల క్రితం ఎక్కువ ధర పెట్టిన దళారులు ఇప్పుడు ఆ ధర కూడా తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యం క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441గా కనీస మద్దతు ధర నిర్ణయించింది. నెల కింద ఈ ధరకు కనీసం దగ్గరగా పెట్టిన దళారులు ఇప్పుడు దొడ్డు రకానికి రూ.2వేలు అంతకంటే తక్కువకే అడుగుతున్నారు. ఇక సన్న రకాలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే బోనస్‌తో కలిపితే క్వింటాల్‌కు రూ.2,961 వస్తుంది. ఇప్పుడు సన్నాలను రూ.2,300 నుంచి రూ.2,400లకే అడుగుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే అధికారులు మాత్రం ప్రైవేట్ వ్యాపారులు మంచి ధరతో ధాన్యం కొంటున్నారని చెప్పడం విడ్డూరంగా ఉన్నది.

కేసీఆర్ హయాంలో ఊరూరా కేంద్రాలు
కేసీఆర్ హయాంలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, మూడేండ్లుగా రేవంత్ సర్కార్ ఆగం చేస్తున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నాడు కేసీఆర్ ఊరూరా కేంద్రాలను ఏర్పాటుచేస్తే రేవంత్‌రెడ్డి ఈ సీజన్లో ఇప్పటికీ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదని ఏకరువు పెడ్తున్నారు. సర్కార్ ప్రచార ఆర్భాటమే తప్ప ఏర్పాట్లు శూన్యం అని స్పష్టంచేస్తున్నాయి.
దళారీకి అమ్మితే డబ్బులు వచ్చేనా?
తమ ధాన్యాన్ని దళారీలకు విక్రయిస్తే వారి నుంచి సకాలంలో డబ్బులు వస్తాయో? లేదోననే అనుమానం రైతుల్ని వేధిస్తున్నది. తమ సొమ్ముకు భద్రతా లేకుండా పోతున్నదని వారిలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. గతంలో డబ్బులు చెల్లించకుండా పరారీ అయిన ఉదంతాలను రైతులు గుర్తుచేస్తున్నారు. కొన్నిచోట్ల మొదట్లో అడ్వాన్స్‌గా కొంత చెల్లించి ఆ తర్వాత మొత్తానికి ఉడాయించిన ఉదంతాలను ఈ సందర్భంగా రైతులు గుర్తుచేసుకుంటున్నారు.
కొంటమని వచ్చేటోళ్లే లేరు
ఇతని పేరు గంగాధర నరేశ్. కొత్తపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన ఈ రైతు.. నెల కింద ట ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. కూలీల సహాయంతో వారంపాటు ప్రతి రోజూ ఆరబెడుతూ తేమ శాతం 17 శాతం రాగానే కుప్ప చేసి టార్పాలిన్లు కప్పి పెట్టుకున్నాడు. ఇటీవల వర్షం పడటం తో తేమ శాతం పెరిగింది. తిరిగి మరో వారం ఆరబెట్టాల్సి వచ్చింది. ఇందుకు కూ లీల ఖర్చు అదనంగా పడింది. ఇప్పటికి నెల అవుతున్నది కానీ, ఒక్క అధికారి కూడా తమ గ్రామానికి వచ్చింది లేదని, ఒక బస్తా ధాన్యం కొనలేదని నరేశ్ వాపోతున్నాడు. నిరుడు ఇదే కేంద్రంలో ఇప్పటికే సగం కొనుగోళ్లు అయ్యాయి. టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నదని, అధికారుల వద్దకు వెళ్లి నేరుగా చెప్పుకొన్నా వినేవారు లేరని నరేశ్ వాపోతున్నాడు. ప్రైవేట్ మిల్లర్లు ఎక్కువ ధర పెట్టి కొంటున్నారని అధికారులు చెప్పడంలో వాస్తవం లేదని, నెల క్రితం కోతలైనా ఇప్పటివరకు ఎవరూ రాలేదని ఆవేదన చెందుతున్నాడు.
వానకు తడిసి మొల్కలు వచ్చినయ్..
పదిహేను రో జుల కింద వడ్లు తెచ్చి కేంద్రంల పోసిన. వడ్లు మంచిగ ఎండినంక వాన వడ్డ ది. తడిసి కింది భాగమంతా మొలకచ్చినయ్. ఇప్పుడు నా పరిస్థితేంది? ఇప్పటిదాంక ఒక్కలు సుత ఇటు మొకాన రాలే. రైతులు వడ్లు పోసుకొని కేంద్రాలల్ల ఎట్లుంటండ్రు? ఈల్ల బతుకేంది? అని అడిగినోళ్లు లేరు. మేం ఏం పాపం చేసినం. నా లెక్కన చాన మం ది రైతుల వడ్లు మొలకచ్చినయ్. మోకమీద ఇవి కొనమంటే మా బతుకేంది. ఇంత ఆలిస్యం ఎన్నడుగాలే. ఇప్పటికైనా వడ్లు కొనాలే. తడిసిన వడ్లకు సుతం ఒక్కపైసా తక్కువకాకుండా కొనాలె.
– కొత్త రాజయ్య, మల్కాపూర్ (కొత్తపల్లి మండలం)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

