హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్) ప్రతిపాదనలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడంపై ఈ నెల 10లోగా, స్కిల్ యూనిర్సిటీల ఏర్పాటుపై ఈ నెల 30లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. టీటీఎల్ ప్రతినిధిబృందం గత శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై రూ.2000 కోట్లతో రాష్ట్రంలోని 50 ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు, 10 స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్మిక, ఉపాధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సమాచార, సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి/అదనపు కార్యదర్శి తదితరులతో కమిటీని ఏర్పాటుచేశారు. సమగ్ర అధ్యయనం నిర్వహించి.. అవసరమైతే క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి నివేదిక సమర్పించాలని సూచించారు. రూ.2000 కోట్లతో రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐల్లో ఐదేండ్లపాటు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అమలుచేస్తామని, ఇందుకు అవసరమైన యంత్రాలు, పరికరాలను సమకూర్చుతామని టీటీఎల్ ప్రతిపాదించింది.