హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): దసరాకు సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు కిటకిటలాడాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే అన్ని బస్సులూ పరిమితికి మించి ప్రయాణిస్తున్నాయి. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు.. దిల్సుఖ్నగర్ బస్‌స్టేషన్, ఎల్బీనగర్ బస్ పాయింట్లలో బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూశారు. వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులు ఉప్పల్ క్రాస్‌రోడ్డులో భారీగా ఉండటంతో అందుకు తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులతో జూబ్లీ బస్ స్టేషన్ కిక్కిరిసిపోయింది. మహబూబ్‌నగర్, కర్నూలు వైపు వెళ్లే ప్రయాణికులు ఆరాంఘర్ చౌరస్తాలో అవస్థలుపడ్డారు.
ప్రధానంగా ఎల్బీనగర్, ఆరాంఘర్, ఉప్పల్ క్రాస్‌రోడ్డు, అల్వాల్‌లో బస్సుల కోసం చాలాసేపు ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు బస్సులు ఏర్పాటు చేశామని చెప్పిన అధికారులు.. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పాయింట్లలో ఎంతకూ బస్సులు రాకపోవడంతో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. జనం రద్దీని తట్టుకోలేక అత్యధికంగా కార్లలో ప్రయాణించేందుకు మొగ్గుచూపారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లు కూడా రద్దీతో కనిపించాయి. కొన్నిచోట్ల పల్లె వెలుగు బస్సులకు ముందు రంగులు మార్చి ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా నడించారు. అధిక చార్జీలు వసూలు చేశారు. ప్రత్యేక సందర్భాలు, పండుగలకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నామని ముందే ప్రకటించిన ఆర్టీసీ.. ‘స్పెషల్ బాదుడు’ ఆపలేదని ప్రయాణికులు మండిపడ్డారు. దూరంతో సంబంధం లేకుండా ప్రత్యేక బస్సుల్లో 50శాతానికి పైగా చార్జీలను వసూలు చేసినట్టు చెప్తున్నారు.