హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఏపీ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (ఏపీవీసీసీ)కి చెందిన ఏడుగురు కంటిచూపు దోషం ఉన్న ఉద్యోగులను ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందని హైకోర్టు తీర్పు చెప్పింది. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులను ఏకపక్షంగా తొలగించడం చెల్లదని స్పష్టంచేసింది. దశాబ్దం క్రితం చేరిన ఉద్యోగులకు వయస్సు నిర్ధారణ పరీక్షల ద్వారా 2012లో నిర్బంధ ఉద్యోగ విరమణ ఉత్తర్వులు జారీచేయడం చట్ట వ్యతిరేకమని వెల్లడించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. వారిని తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని, ఆ తర్వాత వారికి అన్ని రకాల ప్రయోజనాలను చెల్లించాలని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో 1988, 1990 మధ్య కాలంలో వికలాంగుల కో-ఆపరేటివ్ సంస్థలో చేరిన తమను ఉస్మానియా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం నిర్వహించిన వయస్సు నిర్ధారణ పరీక్ష ద్వారా ఆగస్టు 2012లో తొలగించడం అన్యాయమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్ మల్లేశ్ సహా ఏడుగురు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ పూర్తిచేసిన న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల తీర్పు వెలువరించారు. న్యాయవాది నరేశ్‌కుమార్ వాదిస్తూ, పిటిషనర్లకు కంటిచూపు సమస్య బాగా ఉన్నదని తెలిపారు.
రెండు దశాబ్దాల క్రితం ధ్రువీకరించిన జనన తేదీలతో ఉన్న సర్వీసు రికార్డులను పరీక్షల ద్వారా నిర్ణయించడం చెల్లదని, నోటీసు ఇవ్వకుండా తొలగింపు ఉత్తర్వులు ఏకపక్షమని వాదించారు. వారికి ఇంకా ఏడేండ్ల చొప్పన సర్వీసు ఉన్నదని, తిరిగి వారిని సర్వీసులోకి తీసుకుని అన్ని బెనిఫిట్స్ చెల్లించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ, పిటిషనర్ల సర్వీసు రికార్డుల్లో వయస్సును అఫిడవిట్ల ద్వారా నమోదు చేశారని, కాబట్టి మెడికల్ బోర్డు ద్వారా వయస్సు ధ్రువకీరణ చేయడం చట్టబద్ధమేనని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పు చెప్తూ.. పిటిషనర్లు 25 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత వైద్య బోర్డు నివేదిక ఆధారంగా వారిని సర్వీసుల నుంచి తొలగించడం ఏకపక్షమని స్పష్టంచేసింది. వ్యక్తిగతంగా ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా, వారి వివరణ కోరకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం చెల్లదని తేల్చిచెప్పింది. ఉద్యోగంలో చేరినప్పుడు వయసు, ఇతర ధ్రువీకరణలు చేసిన అధికారులు తర్వాత వాటిపై సమీక్ష చేసేటప్పుడు, రేడియోలజికల్, దంత పరీక్షల వంటి శాస్త్రీయ విధానాలను అనుసరించేటప్పుడు నోటీసు కూడా ఇవ్వకపోవడం చెల్లదని స్పష్టంచేసింది. తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వారిని తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కార్పొరేషన్‌ను ఆదేశించింది. బకాయిలతోపాటు ఇతర అన్ని బెనిఫిట్స్ చెల్లించాలని తీర్పులో పేరొన్నది.