హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : 2001-06 మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి భూములను పొంది పరిశ్రమలను ఏర్పాటు చేయని కంపెనీల నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. పరిశ్రమలను ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూమిని స్వాధీనం చేసుకోలేదన్న పిటిషనర్ వాదన సమర్థనీయమేనని పే ర్కొంటూ.. ఇందూటెక్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్, స్టార్జ్ ప్రాపర్టీస్, అనంత టెక్నాలజీస్, జెటీ హోల్డింగ్స్ సంస్థలకు జరిపిన భూ కేటాయింపులను 4 నెలల్లోగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలాంటి ప్రకటన లేకుండా, వేలం నిర్వహించకుండా నామినేషన్ విధానంలో అమ్మకం, లీజు ప్రాతిపదికపై 4,156 ఎకరాల భూమిని పలు కంపెనీలు, వ్యక్తులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2007లో చత్రి సంస్థ పిల్ దాఖలు చేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం తీర్పు వెలువరించింది.