హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, ఇతర ఉద్యోగ విరమణ ప్రయోజనాలు వారి హక్కు అని, అది సర్కురు దాతృత్వం కాదంటూ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు తీవ్ర జాప్యం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాకుండా, చెల్లింపుల్లో జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతున్నదని ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగే ఆసారం కూడా ఉంటుందని హెచ్చరించింది. రాజకీయ పార్టీలు ఆర్థిక వనరులపై స్పష్టతలేకుండా పలు పథకాలను ప్రకటించి ఆర్థిక సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందనే అభిప్రాయం వ్యక్తంచేసింది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో ఆలస్యం జరగడాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వానికి ఆర్థికపరంగా సమస్యలు ఉన్నాయని స్పష్టమవుతున్నదని పేర్కొన్నది. ఉచిత విద్యుత్తు, ఉచితనీరు, ఉచిత రవాణా, వ్యవసాయ రుణాలమాఫీ, ఇతర సబ్సిడీల పేరుతో అధిక మొత్తంలో నిధులను సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిండం వల్ల ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతున్నట్టు న్యాయవాదులు చెప్తున్నారని తెలిపింది. ఉచితాల కోసం ఏకపక్షంగా నిధులను మళ్లిస్తున్నారన్న న్యాయవాదుల వాదనల నేపథ్యంలో సమాజంలోని ప్రజల శ్రేయస్సు కోసం ఉచిత పథకాలపై ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సైతం వాటి విషయంలో జోక్యం చేసుకునేందుకు సంకోచించిందని గుర్తుచేసింది. రాజకీయ పార్టీలు ఆర్థిక వనరులపై స్పష్టతలేకుండా పలు పథకాలను ప్రకటించి ఆర్థిక సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నాయని, ప్రజల శ్రేయస్సు కోసం ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని అభిప్రాయపడింది.
తాను ఉద్యోగ విరమణ చేసి ఆరు నెలలైనారిటైర్మెంట్ బిల్లులు ఆమోదం పొందినా, ఆర్థిక చెల్లింపులు జరగలేదంటూ రిటైర్ ఏఈ నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. అన్ని దశల్లో ఆమోదం లభించినప్పటికీ ఆర్థిక చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని న్యాయవాది కోర్టుకు వివరించారు. గత ఆగస్ట్‌లో టోకెన్ జారీచేసినా, ఇప్పటివరకు సొమ్ము విడుదల చేయలేదని తెలిపారు. గ్రాట్యుటీ యాక్ట్‌లోని సెక్షన్-3 ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వడ్డీ 10% ఉండాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ, చెల్లింపు ప్రక్రియ మొదలైందని, నిధుల కొరత వల్ల విడుదల చేయలేదని అంగీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఉద్యోగ విరమణ ప్రయోజనాల చెల్లింపుల జాప్యంపై హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లపై నిర్దిష్ట కాలంలో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసి, ఆయా పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తరహా వ్యాజ్యాల సంఖ్య రోజురోజుకు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నది.
ప్రభుత్వ ఉద్యోగులు అవిశ్రాంతంగా కష్టపడి పనిచేయడం వల్లే ప్రభుత్వం సమాజానికి సేవలు అందిస్తున్నదని, ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండటంలో కూడా ఉద్యోగుల కృషి ఉన్నదని అభిప్రాయపడింది. ఉద్యోగులు సర్వీసులో ఉండగా తమ ఆదాయంలో నుంచి పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రత కోసం పొదుపు చేసుకున్న డబ్బునే రిటైర్మెంట్ తర్వాత తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నారని చెప్పింది. గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించడమంటే ప్రభుత్వం దాతృత్వం చేయడం కాదని వ్యాఖ్యానించింది. అది ఉద్యోగులు ఏండ్ల తరబడి కష్టపడి, క్రమశిక్షణతో సంపాదించి దాచుకున్న డబ్బు అని గుర్తుచేసింది. రిటైర్మెంట్ తర్వాత చెల్లింపుల్లో జాప్యం ఎకువైతే వాళ్లు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించకూడదని హితవు చెప్పింది. ప్రభుత్వం సకాలంలో సొమ్మును అందించడంలో విఫలమవుతున్నదని అభిప్రాయపడింది. దీనికి కారణాలు చాలా ఉండవచ్చునని, చెల్లింపుల్లో జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతున్నదని ఘాటు వ్యాఖ్య చేసింది. పిటిషనర్‌కు రెండు మాసాల్లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను మూసివేస్తున్నట్టు ప్రకటించింది.