హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గ్రూప్-1 విషయంలో కమిషన్‌కు డివిజన్ బెంచ్‌లో కాస్త ఊరట లభించిందో లేదో వెనువెంటనే 2015 గ్రూప్-2 రూపంలో కొత్త చిక్కువచ్చిపడింది. నిజానికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దయ్యింది. ఒకసారి పేపర్ లీక్, మరోసారి బయోమెట్రిక్ హాజరు తీసుకోకపోవడంతో హైకోర్టు ప్రిలిమ్స్‌ను రద్దుచేసింది. ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు జరిగినా.. మూల్యాంకన వివాదాలు చుట్టుముట్టాయి. పరీక్షలు, మూల్యాంకనం జరిగిన తీరుపై హైకోర్టు సింగిల్ బెంచ్ సుదీర్ఘంగా విచారించి ఫలితాలను రద్దుచేసింది. మోడరేషన్ పద్ధతిలో పునఃమూల్యాంకనం చే యాలని ఆదేశించింది. దీన్ని టీజీపీఎస్సీ హై కోర్టు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొన్నది. ఈ ఊరట నుంచి తేరుకోకముందే గ్రూప్-2తో కొత్త తలనొప్పి వచ్చిపడింది.
డివిజన్ బెంచ్‌కే మొగ్గు..
2015లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్ కు సంబంధించిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూకు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయనున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం కమిషన్ భేటీ అయి తీర్పు ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించింది.
కేసు వివరాలివే..
గ్రూప్-2 నోటిఫికేషన్ 2015లో విడుదలైం ది. రాత పరీక్షలు 2016 నవంబర్‌లో నిర్వహించారు. ఓఎమ్మార్ షీట్ల ట్యాంపరింగ్, వైట్నర్, ఎరైజర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ వంటి లోపాలున్న ఓఎమ్మార్ షీట్లను మూల్యాంకనం చేసినట్టు ఆరోపణలొచ్చాయి. పార్ట్-ఏ (వ్యక్తిగత వివరాలు), పార్ట్-బీ (ఆన్సర్లు) ఆప్షన్లకు వైట్నర్ వినియోగించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై డివిజన్ బెంచ్ కొన్ని సిఫారసులు చేసింది. టెక్నికల్ కమిటీని ఏర్పాటుచేయగా, ఈ కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో 2016 నవంబర్‌లో నిర్వహించిన రాత పరీక్షల్లో ఎంపికైన 1,032 మంది అభ్యర్థులకు 2019 డిసెంబర్లో పోస్టింగ్స్ ఇచ్చారు. టెక్నికల్ కమిటీ సూచనలను కమిషన్ పాటించలేదంటూ అభ్యర్థులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆరేండ్ల క్రితం జరిగిన నియామకాలను కోర్టు కొట్టివేసింది. దీంతో మళ్లీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది.