హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు పొన్నం అనూప్కుమార్తో నెలకొన్న భూ వివాదం కొత్తమలుపు తిరిగింది. భూభారతి రికార్డుల్లో మార్పులు చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఇచ్చిన నంబర్ డీ1/627/2025 ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కలెక్టర్ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ఆదేశిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి
గ్రామ పరిధిలోని 974, 979, 988, 1005, 1006 సర్వే నంబర్లలో ఉన్న 13.05 ఎకరాల భూమిపై వారసుల మధ్య వివాదం నడుస్తున్నది.
ఇందులోకి జిల్లా కలెక్టర్ తలదూర్చి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపి స్తూ రాగం మోహన్, రాగం శ్రీనివాస్ వారి కుటుంబసభ్యులు హైకోర్టును ఆ శ్రయించారు. వారసత్వ భూమి వివాదంలో తలదూర్చిన మంత్రి పొన్నం ప్ర భాకర్ సోదరుని కుమారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించారని వారు ఆరోపించారు. ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ అధికారిక పత్రాలుగా గుర్తిస్తూ భూభారతి రికార్డుల నుంచి తమ పేర్లను తొలగించి, భూమితో సంబంధం లేని వ్యక్తుల పేర్ల ను చేర్చారని హైకోర్టుకు వివరించారు. కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం వల్ల తమ సొంత భూమిపై ఇతరులకు హక్కులు సంక్రమించే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. పిటిషనర్ తర ఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి కలెక్టర్ ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇదీ నేపథ్యం
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పరిధిలోని 974, 975, 978, 979, 988, 1001, 1006 సర్వే నం బర్లలో ఉన్న 18 ఎకరాల భూమిని 1960లో రాగం మల్లయ్య కొనుగోలు చేశారు. ఇందులో కొంత భూమి ఆయ న అమ్ముకోగా.. మిగిలిన 13.05 ఎకరాల భూమిని 1985లో తన కుమారుడు రాగం ఎల్లయ్యకు వారసత్వంగా బదిలీ చేశారు. రాగం ఎల్లయ్య మరణానంతరం, ఆయన వారసులు రాగం మోహన్, రాగం శ్రీనివాస్, సుజాత, రాధ ఈ భూమికి కబ్జాదారులుగా ఉంటూ 65 ఏండ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. కాలక్రమంలో ఈ భూమి ధరలకు రెక్కలు వచ్చాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన కు టుంబసభ్యులు ఈ భూమిపై కన్నేసిన ట్టు పిటిషనర్లు ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నాలుగు తరాల కింద విడిపోయిన వారసుల్లో కొందరిని పోగేసి తమకు అనుకూలంగా మలుచుకున్నారని, వారి ద్వారా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. మంత్రి సోదరుని కుమారులు బాలాజీ రియల్ ఎస్టేట్స్ పే రిట అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకొని, వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. అనంతరం ఆస్తుల్లో వాటా వస్తుందని ఆ వారసులతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారని తెలిపారు.
కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం!
ఈ ఫిర్యాదుల మీద జిల్లా కలెక్టర్ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, పంచనామా చేయకుండా ఏకపక్ష నిర్ణయంతో ఆస్తుల పంపకాలు చేసినట్టు బాధితులు ఆరోపించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించాయి. ఈ భూమి తమదేనంటూ అన్ని ఒరిజినల్ పత్రాలు సమర్పించినా ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపాయి. పూర్తిగా మంత్రి చెప్పిన ఆదేశాల మేరకు నడుచుకున్నారని, అసలు లబ్ధిదారుల పేర్లను తొలగించి, వారి స్థానంలో ఇతర వారసుల పేర్లు చేర్చుతూ జిల్లా కలెక్టర్ గత ఏడాది డిసెంబర్ 12న ప్రొసీడింగ్స్ డీ1/627/2025 జారీ చేశారని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ద్వారా మంత్రి అన్న కొడుకు పొన్నం అనూప్‌కుమార్ మరో ఇద్దరు పరోక్ష హక్కుదారులు అవుతారని తెలిపారు.