Namasthe Telangana | హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డీ దామోదర్‌రావు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ టీ కృష్ణమూర్తిపై అరెస్టు లాంటి ఎటువంటి చర్యలూ తీసుకోరాదని, వారిపై నమోదు చేసిన కేసు దర్యాప్తును నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. మీర్‌పేట పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ దామోదర్‌రావు, టీ కృష్ణమూర్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ జరిపారు. తదుపరి విచారణను వచ్చే నెల ఐదుకు వాయిదా వేశారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి..
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామ పరిధిలోని 92 సర్వేనంబరులోని 290 ఎకరాల లావణి పట్టా భూములకు ఎసరు పెడుతూ ఓ ప్రైవేటు వ్యక్తి అసైనీలతో ఒప్పందం చేసుకోవడంపై ‘నమస్తే తెలంగాణ’ పూర్తి ఆధారాలతో అక్టోబర్ 31న వెలుగులోకి తెచ్చింది. సుమారు రూ.2600 కోట్ల భూదందాకు రంగం సిద్ధమైన వైనాన్ని ‘బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్’ పతాక శీర్షికతో ప్రచురించింది. ఇందుకు స్పందించిన బాలాపూర్ తహసీల్దార్ ప్రవీణ్‌రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు రైతులు.. తమ లావణి పట్టా భూమిని విక్రయించి ఆర్థికంగా బలపడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ కథనంతో తాము నష్టపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మీర్‌పేట పోలీసులు ఒకటో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ సీఎండీ, ఎడిటర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ దశ నుంచే న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. పత్రికలో వచ్చిన కథనానికి నేరపూరిత కుట్రకు సంబంధం ఏమిటని నిలదీశారు.
పిటిషనర్లను అరెస్టు చేయరాదు
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనానికి, మీర్పేట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని ఆరోపణలతో సంబంధం ఏమున్నదని కోర్టు ప్రశ్నించింది. అసైన్డ్ భూమిని డెవలప్మెంట్ పేరుతో ఓ ప్రైవేట్ వ్యక్తి అసైనీలతో ఒప్పందం చేసుకోవడంపై ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురిస్తే.. అది నేరపూరిత కుట్ర ఎలా అవుతుంది? అని నిలదీసింది. మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాలను అసలైనవని చెప్పడం.. బాహాటంగా దుష్ప్రవర్తన, నేరపూరిత కుట్ర.. ఎలా అవుతుందని ప్రశ్నించింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం- 1989 ఎలా వర్తిస్తుందని కూడా నిగ్గదీసింది. అనంతరం పిటిషనర్లు ఇద్దరినీ అరెస్టు చేయరాదని, ఎఫ్ఐఆర్పై దర్యాప్తును నిలిపివేయాలని ఆదేశిస్తూ స్టే ఉత్తర్వులు జారీచేసింది.
నిహారిక కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల మేరకు ఎఫ్ఐఆర్ అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. పిటిషనర్లపై ఎఫ్ఐఆర్లో ఆరోపించిన నేరాభియోగాలకు ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనంలోని అంశాలకు ఎకడా పొంతన కనిపించటంలేదని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని స్పష్టంచేసింది. ఎఫ్ఐఆర్లోని అభియోగాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పిటిషనర్ల ప్రాథమిక హకుకు విరుద్ధమని తేల్చి చెప్పింది. గుర్తించదగిన నేరం లేకుండానే సంబంధం లేని అభియోగాలు ఎఫ్ఐఆర్లో ఉన్నాయని అభిప్రాయపడింది. పత్రికల ద్వారా సాధారణ ప్రజలకు సమాచారాన్ని వ్యాప్తి చేయవచ్చునని, వాక్ స్వాతంత్య్ర హకులు దెబ్బతినే పరిస్థితులు ఉండకూడదని వ్యాఖ్యానించింది.
కథనానికి.. అభియోగాలకు సంబంధమేది?
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, పత్రికలో వచ్చిన కథనంలోని అంశాలకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అభియోగాలకు, సెక్షన్లకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పత్రిక భూమికి సంబంధించిన కథానాన్ని రాసిందని అన్నారు. దాని ఆధారంగా ఏదో కుట్ర జరిగిపోయిందంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చెల్లదన్నారు. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణానికి లోబడే పత్రికా కథనం ఉన్నదని తెలిపారు. కథనం ప్రచురణ వెనుక రాగద్వేషాలు లేవని చెప్పారు. కుట్ర, ఫోర్జరీ వంటి అభియోగాలతోపాటు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా వర్తిస్తుందని చెప్పడం చాలా దారుణమని అన్నారు. పత్రికలో కథనం వచ్చాక తహసీల్దార్, ప్రవీణ్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారని, ఆ వెంటనే బాలకృష్ణ మరో ఎడుగురు ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సీఎండీ, ఎడిటర్లపై తప్పుడు అభియోగాలతో ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం పత్రికలో కథనం ప్రచురితమైందని చెప్పారు. ఆరోపించిన నేరాలకు పిటిషనర్లు ఏ దశలోనూ పాల్పడలేదన్నారు. వాస్తవాలను వెలుగులోకి తేవడమే నేరమన్నట్టుగా ఆ ఫిర్యాదు, ఆపై పోలీసుల ఎఫ్ఐఆర్ ఉన్నాయని అన్నారు. తక్షణమే పోలీసుల దర్యాప్తును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు. పిటిషనర్లు ఇద్దరినీ అరెస్టు చేయకుండా కూడా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తిచేశారు.
పత్రికా స్వేచ్ఛ మేరకే కథనం
పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘నమస్తే తెలంగాణ’ కథనంపై నమోదైన పోలీసు కేసు ప్రకారం పిటిషనర్లపై కుట్ర, మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాలను అసలైనవని చెప్పడం.. దుష్ప్రవర్తన, నేరపూరిత కుట్ర వంటివే కాకుండా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం- 1989 కూడా వర్తిస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రాజ్యాంగంలోని అధికరణం 19(1)(ఎ) ప్రకారం పత్రికా స్వేచ్ఛ మేరకు కథనం ప్రచురితమైందని, అందులోని అంశాలకు, పోలీసుల అభియోగాలకు ఏమైనా సంబంధం లేదా పొంతన ఉందా అని ప్రశ్నించింది. పోలీసుల కేసు దర్యాప్తు వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని, అయితే, నిహారిక కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే, ఫిర్యాదుకు ఆధారమైన ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనంలోని విషయాలకు, ఎఫ్ఐఆర్లో అభియోగాలకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. అందుకే ఎఫ్ఐఆర్ మేరకు దర్యాప్తును నిలిపివేస్తున్నట్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా పిటిషనర్లు ఇద్దరినీ అరెస్టు చేయరాదని ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిర్యాదుదారులైన టీ బాలకృష్ణ, పీ వెంకటేశ్, జీ ఎల్లమ్మ. కృష్ణ, టీ దశరథ, పీ రాజు, ఎస్ బాబు, బీ జోగులను అదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.