హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో-9లోని నాలుగు కీలక మార్గదర్శకాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 30 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం, కొత్త విద్యా సంవత్సరంలో ఫీజుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను సవాలు చేస్తూ పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది.
పెండింగ్ బకాయిల చెల్లింపుతోపాటు కొత్త విద్యాసంవత్సరానికి ఎంతమేరకు నిధులను కేటాయింపులు చేశారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది ఎస్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో అడ్వొకేట్ జనరల్ స్వయంగా హాజరై పూర్తిస్థాయి వాదనలు వినిపిస్తారని, ఈ నెల 30 వరకు గడువు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం ఆగస్టు మధ్య నాటికి తొలి విడత ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ప్రారంభమవుతాయని, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి నిధుల విడుదల ఉంటుందని చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్, తరణ్జీరెడ్డి వాదనలు వినిపిస్తూ జీవో 9లోని పేరా 5.2(ఈ), 10.2, 10.4, 12.1(ఏ) నిబంధనలు గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమచేసి, వారు ఏడు రోజుల్లోపు కళాశాలలకు చెల్లించాలనే విధానం, ఆ విధానాన్ని తప్పనిసరిగా అంగీకరించాలనే షరతులు ప్రస్తుత అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వాదించారు.
ఈ నిబంధనల కారణంగా విద్యాసంస్థల ఆర్థిక నిర్వహణ దెబ్బతిం టున్నదని, ప్రవేశాల ప్రక్రియలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఆగస్టు 15లోపు పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తే పిటిషన్ల ఉపసంహరణపై కూడా ఆలోచిస్తామని తెలిపారు. ఇదే సమయంలో కొందరు విద్యార్థులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేసి తమ ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందని చెప్పడంతో తాము కళాశాలల్లో చేరామని, ఇప్పుడు కళాశాలలు ఫీజులు చెల్లిస్తేనే తరగతులకు అనుమతిస్తామని ఒత్తిడి చేస్తున్నాయని కోర్టుకు విన్నవించారు. ముఖ్యంగా 2, 3, 4వ సంవత్సరం చదువుకొంటున్న విద్యార్థుల నుంచి ఫీజుల కోసం ఒత్తిడి పెరుగుతున్నదని చెప్పారు. ప్రభుత్వంకళాశాలల మధ్య నెలకొన్న వివాదంలో తాము నష్టపోతున్నామని వాపోయారు. పేద విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రక్షణ కల్పించాలని కోరారు. అన్ని పక్షాల వాదనల తర్వాత హైకోర్టు.. ప్రభుత్వం తరచూ గడువు కోరుతున్న నేపథ్యంలో ఈ నెల 30న అడ్వొకేట్ జనరల్ పూర్తిస్థాయి వాదనలు వినిపించే వరకు జీవో9లోని గత మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న నాలుగు నిబంధనల అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేసింది.
హైకోర్టు తాతాలికంగా నిలిపివేసిన జీవో 9లోని నిబంధనల్లోని పేరా 5.2 (ఈ) ప్రకారం.. ప్రభుత్వం సాలర్షిప్ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. పేరా 10.2 ప్రకారం.. విద్యార్థులు ఏడు పని దినాల్లోపు కళాశాలలకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేరా 10.4 ప్రకారం.. కళాశాలలు అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. పేరా 12.1(ఏ) ప్రకారం ప్రతి విద్యాసంస్థ డీబీటీ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు నిబంధనల అమలుపైనే హైకోర్టు జూన్ 30 వరకు మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది.