హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ సందర్శన వేళలను ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలన్న విన్నపంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సచివాలయ ప్రధాన ద్వారం వద్ద ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు సందర్శన సమయాన్ని పెంచాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలవడంతో హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.
చట్టవిరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్ల సేకరణ ;మాజీ ఎంపీ ఉండవల్లి వాదన తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): డిపాజిట్ల సేకరణలో ‘మార్గదర్శి’ సంస్థ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని, ఈ తంతు గత 45 ఏండ్లుగా కొనసాగుతున్నదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ‘మార్గదర్శి’ అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందని, ఇప్పుడు ఏపీలోని టీడీపీ ప్రభుత్వంతోపాటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కే సుజన ధర్మాసనం ప్రకటించింది.