హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరువు హత్యలు, కాప్ పంచాయతీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 2017 నుంచి ఇప్పటివరకు నాలుగు పరువు హత్యలు, పరువు పోయిందంటూ మూడు దాడుల ఘటనలు నమోదయ్యాయని అన్నారు. ఈ కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయని పోలీసుల తరఫు ప్రత్యేక న్యాయవాది ఏ సంజీవ్‌కుమార్ చెప్పారు. రాష్ట్రంలో 50 వరకూ జరిగిన కాప్ పం చాయతీలపై నమోదైన కేసులు ఏ దశలో ఉన్నాయో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సమగ్ర వివరాలతో మరో కౌంటర్ పిటిషన్ దాఖలుచేయాలని పేర్కొంది. పరువు హత్యలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలు గురించి కూడా నివేదించాలని కోరింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.