High Court | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక సదరు విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో మారిన పేరును రాయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటో నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తన పేరు మార్చుకున్నట్టు గెజిట్ జారీ అయినప్పటికీ ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీ ఆ మేరకు తన సర్టిఫికెట్లో మార్పులు చేయడం లేదంటూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వీ మధుసూదన్‌రెడ్డి వాజ్యం దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రూల్స్ పేరుతో కౌంటర్ దాఖలు చేయడానికి బదులు విద్యార్థుల సర్టిఫికెట్లలో పేరు మారిస్తే సరిపోతుందని సూచించింది. కొత్త పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించింది. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం సబబుకాదని హితవు చెప్పింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.