హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అమీర్ రహీల్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ కింది కోర్టు ఉత్తర్వులపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై శనివారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది వెంకటరమణ వాదన వినిపిస్తూ.. కింది కోర్టులో విచారణ మొదలై, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్న దశలో దర్యాప్తునకు అనుమతించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
కేసులో నిందితుడైన అఫ్నాన్ అహ్మద్‌కు నోటీసు ఇచ్చిన పోలీసులు.. పిటిషనర్‌కు నోటీసు ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. గతంలో ఈ కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని డీసీపీ నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తునకు ఆదేశించారని, కింది కోర్టు చట్టబద్ధంగానే ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. దీనిపై జస్టిస్ సుజన స్పందిస్తూ.. పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చని, దీనికి ముందు నిందితుల వాదన వినాలన్న నిబంధన లేదని తెలిపారు. అమీర్ రహీల్ పిటిషన్‌ను కొట్టివేశారు.