హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (61)కి హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ అధ్యక్షతన మంగళవారం ఫస్ట్ కోర్టు హాల్లో సమావేశమైన జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు జస్టిస్ ప్రియదర్శిని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. న్యాయవ్యవస్థకు ప్రియదర్శిని అందించిన సేవలు, ఆమె వెలువరించిన కీలకమైన తీర్పులను అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతించారు.
కార్యక్రమంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు జగన్, జస్టిస్ ప్రియదర్శిని కుటుంబసభ్యులు, పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్ ప్రియదర్శిని మృతికి సంతాపం తెలిపింది.