హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాట కేసులో ‘పుష్ప-2’ చిత్ర నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్‌కు ఊరట లభించింది. వారిని అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంధ్య థియేటర్ వద్ద తొకిసలాట జరిగి, ఓ మహిళ మరణించడంపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ‘పుష్ప-2’ నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ కే సుజన ఇటీవల ఈ ఉత్తర్వులు జారీచేశారు. తొక్కిసలాట కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చని, ఆ దర్యాప్తునకు ‘పుష్ప-2’ నిర్మాతలు సహకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగతావారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 6కు వాయిదా పడింది.