హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం ప్రకారం నిర్దేశిత ప్రాంతాలకు 4 వారాల్లోగా ప్రత్యేక అధికారులను నియమించాలని హైకోర్టు రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఆ అధికారులు ఎస్ఐ కంటే ఉన్నత హోదా కలిగినవారై ఉండాలని స్పష్టం చేసింది. మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంలోని సెక్షన్-13 ప్రకారం ఆ ప్రాంతాల్లో దాడులు, సోదాలు, జప్తులు చేసే అధికారం ఎస్ఐ స్థాయి అధికారికి లేదని, అందుకే ప్రత్యేకాధికారిగా ఇన్స్పెక్టర్ లేదా అంతకంటే ఎకువ స్థాయి అధికారిని నియమించాలని తెలిపింది. వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని, వాణిజ్య పరంగా మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదు మేరకు బ్లూబెల్స్ స్పా సెంటర్‌పై పంజాగుట్ట ఎస్సై దాడులు జరపడం, అక్కడ ఫోన్లు సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం చెల్లదని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీర్పు చెప్పారు.