హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు 1994 లో జారీచేసిన జీవో-1, 2023లో జారీచేసిన ప్రొసీడింగ్స్ అమలు గురించి తెలపాలని కోరింది. ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్ పథకం అమలుపై కూడా పూర్తి వివరాలు నివేదించాలని ఆదేశించింది. జీవో 1 అమలుపై హైదరాబాద్కు చెందిన కే అఖిల్శ్రీ గురుతేజ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖలు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా విద్యాశాఖాధికారులు, ఆహార భద్రతా కమిషనర్ తదితరులకు నోటీసులు ఇచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.