హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సుల ప్రారంభానికి సంబంధించిన అప్లికేషన్లను మూకుమ్మడిగా తిరసరించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. కాలేజీలు దాఖలు చేసుకున్న అప్లికేషన్లను ప్రభుత్వం పునఃపరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం అవసరమైతే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలను కూడా సవరించుకోవాలని సూచించింది. కొత్త కోర్సులకు అనుమతినిచ్చే ప్రభుత్వ పాలసీయే సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. కాలేజీ యాజమాన్యాలు దాఖలు చేసుకునే అప్లికేషన్ల తిరసరణకు సహేతుక కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తే అన్ని కాలేజీలకు ఉపయుక్తంగా ఉంటుందని పేరొంది. వివక్ష ఉండరాదని, చట్ట నిబంధనలకు అనుగుణంగా అప్లికేషన్ల పరిశీలనచర్యలు ఉండాలని కూడా తేల్చి చెప్పింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి, సీట్ల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ ఎన్ రాజేశ్వర్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం రద్దు చేసింది.
ప్రైవేటు కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, శ్రీరఘురాం, ఎస్ నిరంజన్‌రెడ్డి, పీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. కంప్యూటర్ కోర్సు దాని అనుబంధ కోర్సుల్లో సీట్ల పెంపు వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. కంప్యూటర్ కోర్సు, దాని అనుబంధ కోర్సుల్లో సీట్లను పెంచుకోవడానికి జేఎన్టీయూ ఎన్వోసీ ఇచ్చింది. దీంతో ఏఐసీటీఈ ఆమోదం చెప్పింది. సాంకేతికంగా ప్రభు త్వ అనుమతి తప్పనిసరి కాబట్టి అప్లికేషన్లు పెట్టుకుంటే రాష్ట్రం తిరసరించడం అన్యా యం అని చెప్పారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొత్త అనుమతులు మంజూరు చేయడం వల్ల విద్యాప్రమాణాలు పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎస్సీ కోర్సులో సీట్లు మిగిలిపోయాయని చెప్పారు. ఉన్నత విద్యా ప్రమాణాల పెంపు కోసమే కాలేజీల అప్లికేషన్లను ప్రభుత్వం తిరసరించిందని తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌లో సీట్ల పెంపు జరిగితే అధ్యాపకుల సమస్య వస్తుందన్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సీట్లను పునరుద్ధరించాలని జూలైలో ఏఐసీటీఈకి జేఎన్టీయూ రిజిస్ట్రార్ లేఖ రాసినట్టు వివరించారు. ఏఐసీటీఈ అనుమతి పరిశీలిస్తే.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరనే షరతు ఉందనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు.. షరతులతో కూడిన నిరభ్యంతర పత్రాన్ని జెఎన్టీయు ఇచ్చిందని, దీని ప్రకారం అనుమతులు కావాలని కోరడం చెల్లదని తెలిపారు.
వాదనల తర్వాత హైకోర్టు, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కాలేజీల అప్లికేషన్లను ప్రభుత్వం తిరిగి పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుంటామంటే అందుకు అనుగుణంగా అప్లికేషన్లను ప్రభుత్వానికి పంపుతామని చెప్పింది. ఒకవేళ ప్రభుత్వం అందుకు నిరాకరిస్తే, తామే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది. దీనిపై ఏజీ కల్పించుకుని, అప్లికేషన్లను ప్రభుత్వ పునఃపరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో అప్పీళ్లపై విచారణను ముగిసినట్లు ధర్మాసనం ప్రకటించింది.