హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అర్హత లేకుండానే బీటెక్/బీఈ అభ్యర్థులను అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ ఏఈ, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేయడంపై దాఖలైన పిటిషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నియామకాల్లో ఎంపికైన 614 మంది తరఫున 65 మందిని ప్రతివాదులుగా చేర్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని వారికి నోటీసులు జారీచేసింది. మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, భూగర్భజలశాఖ, ఆర్ అండ్ బీ, నీటిపారుదలశాఖలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
తెలంగాణ సర్వీస్ కమిషన్ 2022లో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అర్హత లేకుండానే బీటెక్ /బీఈ అభ్యర్థులను ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ కొలకాని శశికుమార్ సహా తొమ్మిది మంది దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కే శరత్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఇప్పటికే తాతాలిక ఎంపిక పూర్తయిందని, ఈ కేసులో కోర్టు ఇచ్చే ఉత్తర్వులు ఎంపికైన అభ్యర్థులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వారి వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని అన్నారు.
తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్ వాదిస్తూ మొత్తం 787 మంది తాతాలికంగా ఎంపికయ్యారని, అందులో 173 మందికే నోటిఫికేషన్లో పేరొన్న డిప్లొమా అర్హత ఉన్నదని తెలిపారు. మిగిలిన 614 మందిని ప్రతివాదులుగా చేర్చడం కష్టమని చెప్పారు. కాబట్టి 65 మందిని మాత్రమే చేర్చామని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి 65 మందికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 25కు వాయిదా వేశారు.