హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు, ప్రత్యేక న్యాయవాదులను పదవీకాలం పూర్తికాకుండానే ఎందుకు తొలగించాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న జీపీలు, ఏజీపీలను తొలగిస్తూ గత నెల 26న ప్రభుత్వం జారీచేసిన జీవో 354కు వ్యతిరేకంగా 20 మంది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ పుల్లా కార్తీక్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం ప్రభుత్వ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. ఆ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.