నిజామాబాద్ లీగల్/కామారెడ్డి, అక్టోబర్ 7: సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ న్యా యసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్‌కోషి అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ కలెక్టరేట్, కామారెడ్డి కోర్టు హాలులో వేర్వేరుగా నిర్వహించిన ‘లీగల్ మాడ్యూల్ క్యాంప్’ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయసేవలు అందక ఎవరూ నష్టపోరాదనే లక్ష్యంతో డిఫెన్స్ లీగల్ ఎయిడ్ సిస్టమ్‌కు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ట్రాన్స్జెండర్లు, సెక్స్‌వర్కర్లను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయిస్తామని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత మాట్లాడుతూ.. పరిమితిలో ప్రభుత్వ, న్యాయ వ్యవస్థల ఆర్థిక, న్యాయ సహాయాలు ఉంటాయని, వాటిని ఉపయోగించుకుని స్వతహాగా ఎదగాలని సూచించారు. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్‌గాంధీ, జితేశ్ వీ పాటిల్, సీపీ సత్యనారాయణ, ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు.