రంగారెడ్డి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్ నంబర్ 13 నుంచి గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 300 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం దాదాపు 1,000 ఎకరాల భూములను సేకరించేందుకు నిరుడు అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో లేమూర్ గ్రామ సమీపంలో ఉన్న తమ భూములను తీసుకోవద్దంటూ మౌనిక, మరో 29 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా, వారి అభ్యంతరాలను పరిశీలించకుండానే భూములను స్వాధీనం చేసుకుంటున్నారని వారి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎన్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే దాదాపు రూ.60 కోట్ల వరకు పరిహారం చెల్లింపులు కూడా జరిగాయని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్లకు చెందిన భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని, వారి సమ్మతితోనే భూములు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.
సర్వే బృందాన్ని అడ్డుకున్న రైతులు
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆమనగల్లు మండలం సాకిబండతండాకు వచ్చిన సర్వే బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. తమ భూములను తీసుకోవద్దని కోరారు.