హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లాలో కాందిశీకుల భూ మికి సంబంధించిన వివాదాన్ని గత 25 ఏండ్ల నుంచి పరిషరించకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. ఆ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని రద్దయిన ఎవాక్యూ ఇంటరెస్ట్ విభజన చట్టం-1951 కింద విజ్ఞప్తి చేసుకున్న దరఖాస్తుదారుల తరాలు కూడా మారిపోతున్నాయని, అయినా ఆ వివాదం పరిషారం కాకపోవడం ఏమిటని అధీకృత అధికారిని ప్రశ్నించింది. ఆ దరఖాస్తును 3మాసాల్లోగా పరిషరించాలని ఆదేశించింది. ఇప్పటివరకు ఆ దరఖాస్తు పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ.50 వేలు సైనిక సంక్షేమ నిధికి చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. దేశ విభజన సమయంలో జనగామ తా లూకా కుందరం, బెకల్, సముద్రాల, జనగామ, మెట్టూరు, మాడూరు, సింగరాజపల్లి, బహిరిపల్లి, పఖాల్, పాలకుర్తి, ఇర్రివాను, ము తారం, ఇప్పుగూడ, రఘునాథ్‌పల్లి ప్రాంతాల నుంచి కొందరు పాకిస్థాన్‌కు వెళ్లిపోవడంతో వారి భూములు కాందిశీకుల చట్టం పరిధిలోకి వచ్చాయి. అనంతరం భారత్‌లోనే ఉన్న వారి సోదరి సలేహా ఫాతిమా బేగం ఆ భూములను స్వాధీనం చేసుకుని, సేల్ సర్టిఫికెట్ కూడా పొందారు. కానీ, 1962లో ప్రభుత్వం ఆ భూములను సేల్ సర్టిఫికెట్ నుంచి తొలగించింది. దీనిపై ఫాతిమా బేగం వారసులు పిటీషన్ వేయడంతో శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి.. మూడు నెలల్లోగా ఆ దరఖాస్తును పరిష్కరించాలని అధీకృత అధికారిని ఆదేశించారు.