హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై కోర్టులు న్యాయ సమీక్ష జరిపేందుకు విధివిధానాలు ఉన్నాయని, బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫి రాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే కోర్టులు న్యాయ సమీక్ష జరిపేందుకు వీలుంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి హైకోర్టులో వాదించారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై ఫలానా తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని గడువు నిర్ణయించే అధికారం కోర్టులకు లేద ని స్పష్టం చేశారు.
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి వేసిన అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టడంతో ఏజీతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.