హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలు చేపట్టకపోవటానికి కారణాలు వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆ పోస్టులు భర్తీ చేయకుంటే ఈ పిటిషన్ కారణంగా వాటి నియామకాల ప్రక్రియను ఆపొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13న జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలను చేపట్టకపోవడం వల్ల 2021 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి కమిషన్ పనిచేయడం లేదంటూ దాఖలైన పిల్‌ను మంగళవారం ధర్మాసనం విచారించింది.