హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు పోలీస్ స్టేషన్లో స్వీపర్‌గా పనిచేసిన షేక్ జానీమియాకు 1991 నుంచి పూర్తి వేతన బకాయిలను చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ నేరం కింద రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని జస్టిస్ జే అనిల్ కుమార్ ఇటీవల హెచ్చరించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలుకు 3 వారాల గడువు కావాలని ఎస్పీ తరఫున ప్రభుత్వ న్యాయవాది కోరడంతో.. అందుకు న్యాయమూర్తి అనుమతించారు. ఇదే చివరి అవకాశమని పేరొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
బేవరెజ్ కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించండి
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1993 నాటికి 5 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 47 మంది కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమబద్ధీకరణ కేవలం పెన్షన్, సంబంధిత ప్రయోజనాలకేనని స్పష్టం చేసింది. విచారణ సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు పెన్షన్ ప్రయోజనాలను అందజేయాలని తీర్పును వెలువరించారు.