హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళన చర్యలు తీసుకునే ముందు అధికారులు చట్టాలను అమలుచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. మూసీ ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించే ముందు సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అమలుచేసి తీరాలని వెల్లడించింది, ఆ తర్వాతే అనధికారిక ఆక్రమణలు, అక్రమ నిర్మాణదారులను ఖాళీ చేయించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మూసీ ఒడ్డున ఉన్న ఇండ్ల కూల్చివేతలను సవాలు చేస్తూ బాధితులు దాఖలు చేసిన 46 పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. మూసీ పునరుద్ధరణ జరగాల్సిన అవసరం ఉన్నదని, అయితే దీన్ని పద్ధతి ప్రకారం చట్ట నిబంధనలకు అనుగుణంగా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మూసీ పునరుద్ధరణ కార్యక్రమం వల్ల ప్రభావితమయ్యే వారి ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించాలని ఆదేశించారు. పునరుద్ధరణ ప్రక్రియ వల్ల ప్రభావితమయ్యే పేదలకు వివిధ ప్రభుత్వ పథకాల కింద సరైన వసతి కల్పించాలని పేరొన్నారు. ఒకవేళ పట్టా, శిఖం భూములు ఉన్నైట్టెతే వారికి నోటీసులు జారీచేసి
భూసేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లించాకే చర్యలు ఉండాలని తెలిపారు.
నీటివనరుల రక్షణకు మిషన్ కాకతీయ
మూసీ వరదలు 1908లో ముంచెత్తడంతో నాటి నిజాం పాలకులు జంట జలాశయాలను నిర్మించారని న్యాయమూర్తి పేరొన్నారు. ఆనాడే పటిష్టమైనల్యాండ్ రెవెన్యూ యాక్ట్ – 1317 అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 24 పబ్లిక్ రోడ్లు, దారులు, బ్రిడ్జీలు, గుంతలు, నదులు, చెరువులు, ట్యాంకుల, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలపై సర్వహకులు ప్రభుత్వానివేనని చెప్పారు. నీటి వనరుల పరిరక్షణలో భాగంగా పూడికతీత, బండ్లు ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వం మిషన్ కాకతీ య పథకాన్ని చేపట్టిందని కొనియాడారు. ఇందులో భాగంగా ప్రభుత్వం బిల్డింగ్ నిబంధనలు రూపొందించిందని, జీవో 168 జారీ చేసిందని చెప్పారు. అందులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీల్లేదనే నిబంధనలున్నాయని గుర్తుచేశారు దేశంలోనే మొదటిసారిగా 48 వేల మేజర్, మైనర్ చెరువుల్లో పూడికతీతను దశలవారీగా చేపట్టాలని నాటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ట్యాంకులు, చెరువుల భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు కూడా ఇచ్చిందన్నారు.
కింది కోర్టులకు సూచనలు..
రివర్బెడ్, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న తాతాలిక, అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించడానికి చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. అధికారులు బిల్డింగ్ నిబంధనలు కచ్చితంగా అమలుచేయాలని, నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో ఉన్న నిర్మాణాలను చట్టప్రకారం తొలగించాలని పేర్కొన్నారు. మూసీ నదిలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీచేసే ముందు 2023లో ఇదే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని కింది కోర్టులకు ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను గుర్తించడానికి నిర్వహించే సర్వేకు పిటిషనర్లు, ప్రజలు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలని ఆదేశించారు. ఈ కోర్టు ఉత్తర్వుల అమలు నిమిత్తం నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
నదులు, నీటి వనరులు, సరస్సులను, చెరువులను ఆక్రమించుకున్న అక్రమారులపై వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ హెచ్ఎండీయే అనుమతులు మంజూరు చేసిన లేఔట్ నుంచి కొనుగోలు చేశామని, జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టాక కూల్చివేతలు చేపట్టారని తెలిపారు. విద్యుత్తు కనెక్షన్లు పొందడంతోపాటు ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని, అయితే ఎలాంటి విచారణ జరపకుండా, సర్వే నిర్వహించకుండా, నోటీసు జారీచేయకుండా మూసీ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నాయంటూ కూల్చివేతలు చేపట్టారని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ. 2021లో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే శాఖల ద్వారా సర్వే నిర్వహించామని చెప్పారు.
మేడ్చల్ -మలాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లో విలేజీ మ్యాప్‌లు, మెజర్మెంట్స్ రికార్డుల ద్వారా సర్వే పూర్తిచేసి మండలాల వారీగా శాటిలైట్ మ్యాప్‌లను సిద్ధం చేశామని తెలిపారు. వాటి ఆధారంగా జూలై, ఆగస్టుల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించామని అన్నారు. 50 మీటర్ల బఫర్‌జోన్‌గా పరిగణనలోకి తీసుకోగా 10,017 నిర్మాణాలున్నాయని, ఇందులో 2,166 నిర్మాణాలు రివర్‌బెడ్‌లో, 7851 బఫర్‌జోన్‌లో ఉన్నట్టు గుర్తించామన్నారు. రివర్బెడ్, బఫర్జోన్లలో నివాసం కోల్పోతున్నవారి కోసం మానవీయ కోణంలో 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల్లను కేటాయిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్‌లో 754 జీవో జారీ చేసిందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు పలువురు అంగీకరించారని, మూడు జిల్లాల్లో 319 కుటుంబాలకు పునరావాసం కల్పించడంతోపాటు ఆర్థిక సాయం కూడా అందే ఏర్పాట్లు చేశామని చెప్పారు.
చట్టాలున్నా.. చెరువుల కబ్జా
తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయమూర్తి పేరొన్నారు. ఆ అధికారికి చట్ట ప్రకారం ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్టు తెలుస్తున్నదని అన్నారు. జీవో జారీ చేయడం ద్వారా నీటిపారుదల శాఖ అధికారికి బాధ్యతలు, విధులు అప్పగించడం తప్పుకాదని చెప్పారు. ఇరిగేషన్ చట్టంలోని సెక్షన్ 4 కింద విధులు నిర్వహించడానికి ఏ అధికారినైనా నియమించవచ్చని అన్నారు. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులని, వాటిని ట్రస్టీలుగా అధికారులు నిర్వహిస్తారని తెలిపారు. చెరువుల్లో ఇండ్ల పట్టాలను ఇచ్చినా, కేటాయింపు జరిపినా వాటికి చట్టబద్ధతలేదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం చట్టం రూపొందించిందని, న్యాయ సమీక్షలో చట్టం తీసుకువచ్చిన ఉద్దేశాలను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. మూసీలో పర్యావరణ సమతుల్యత పరిరక్షణ కోసం, భవిష్యత్తు తరాల కోసం ప్రభుత్వం విధివిధానాలను తీసుకువచ్చిందని అన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు పేరొన్నారు.