హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): లగచర్ల కేసు (ఎఫ్ఐఆర్ 145)లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ.25 వేల పూచీకత్తుతోపాటు అంతే మొత్తంతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని పిటిషనర్‌కు స్పష్టం చేశారు.
దాడి నిందితులకు బెయిల్ ;అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసు నిందితులకు ఊరట
బంజారాహిల్స్, డిసెంబర్ 23: అల్లు అర్జున్ ఇంటి వద్ద దాడి కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులకు బెయిల్ లభించింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరుగురిని అరెస్ట్ చేసి సోమవారం ఉదయం 7 గంటలకు 17వ ఏసీసీఎం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా వారికి రూ.10వేల సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. 12 గంటల్లోనే బెయిల్ లభించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు సరైన ఆధారాలు జతపర్చకపోవడం వల్లే బెయిల్ లభించిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.