హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): అనుమతులూ లేకుండా నిర్మించిన వాటిపై కఠిన చర్యలు తీసుకోకపోగా, క్రమబద్ధీకరణ పేరుతో వాటిని జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తున్నదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో మొదట అక్రమ/అనధికారిక నిర్మాణాలను జీహెచ్ఎంసీ అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ విధానాలు రూపొందించడం సర్వసాధారణమైందని వ్యాఖ్యానించింది. కఠినచర్యలు తీసుకోకపోగా అందుకు వ్యతిరేకంగా క్రమబద్ధీకరణ విధానం అమలులోకి తేవడం వల్ల అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం పెరిగిపోయిందని అభిప్రాయపడింది. రంగారెడ్డి జిల్లా మణికొండ జాగీరులోని ఆక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లను ఆదేశించింది. లేనిపక్షంలో హెచ్ఎండీయే, జీహెచ్ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీరు గ్రామంలో సర్వే నం. 203/1/3/1 204 నుంచి 209, 210/1/3ల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదంటూ మణినగర్ ప్లాట్ మెంబర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ, ఎస్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని గతంలో విచారించిన హైకోర్టు మణికొండ జాగీరులో యథాతథస్థితిని కొనసాగించాలని 2023లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అకడ జరిగే నిర్మాణాలకు సంబంధించి ఫొటోలను సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలుకావడం లేదని, అకడ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ ఎస్ గోపాల్ కోర్టు ధికరణ పిటిషన్ వేశారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు.
వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ, ఫొటోలను పరిశీలిస్తే అధికార నిర్మాణాలు చేపట్టినట్టుగా ఉందని అభిప్రాయపడింది. ప్రాథమికంగా చూస్తే అక్రమ, అనధికారిక నిర్మాణాలను తొలగించడంలో, అడ్డుకోవడంలో అధికారులు వైఫల్యం చెందినట్టు ఉందని పేరొంది. 2023 మార్చి 14న ఇచ్చిన యథాతదస్థితి ఉత్తర్వులు అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని తప్పుపట్టింది. మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మణికొండ జాగీర్‌లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, అనుమతులు పొందినవి ఎన్ని, అనుమతులు పొందిన తర్వాత ఉల్లంఘించి నిర్మాణాలు చేసినవి ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. అక్రమ నిర్మాణాలకు కారణమైన ఉద్యోగులపై తీసుకున్న చర్యలను జూలై 2లోగా అందజేయాలని తెలిపింది.