హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): హుజూర్నగర్ ఉప ఎన్నిక సందర్భంగా కోడ్ ఉల్లంఘించారంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. పొనుగోడులో అనుమతుల్లేకుండా కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని గరిడేపల్లి పోలీసుస్టేషన్లో అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై 2019లో కేసు నమోదైంది. ఈ కేసుపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతున్నది.
ఈ కేసును కొట్టేయాలన్న రేవంత్ పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం విచారించి తుది ఉత్తర్వులు జారీచేశారు. రేవంత్‌పై నమోదైన కేసులో ఆధారాలు లేవని తీర్పు చెప్పారు. మరో కేసులోనూ రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది.
కింది కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. వరంగల్ జిల్లా కమలాపూర్ పోలీసుస్టేషన్లో 2500 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారని రేవంత్ ఇతర కాంగ్రెస్ నేతలపై 2021లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారన్నది కేసు సారాంశం.