HYDRAA | హైదరాబాద్, డిసెంబర్ 31, (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి మండిపడింది. గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్‌ను స్వయంగా తాము హెచ్చరించినా మార్పు రాకపోవడం శోచనీయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే తీరును కొనసాగిస్తే మళ్లీ కోర్టుకు పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఖాజాగూడ పరిధిలోని భగీరథమ్మ చెరువు ఆక్రమణల తొలగింపునకు కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవకముందే ఎలా కూల్చివేస్తారంటూ నిప్పులు చెరిగింది.
ఖాజాగూడలో చెరువు ఎఫ్టీఎల్ ఏరియాలో అక్రమ నిర్మాణాల నెపంతో వాటిని హైడ్రా మంగళవారం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతలపై బాధితుడు మేకల అంజయ్య మరికొందరు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నెం 18/ఇలో 12,840 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పి ఏ విధమైన నోటీసులు జారీ చేయకుండానే కూల్చివేశారని కోర్టుకు తెలిపారు.
దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి స్పందిస్తూ.. హైడ్రా అధికారులు అకడ విచారణ జరిపిన తరువాతనే చర్యలు తీసుకున్నారని చెప్పారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారని, వాటిని కూల్చేస్తే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని జీహెచ్ఎంసీ న్యాయవాది వాదించారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని నిలదీసింది. నోటీసులు ఇచ్చామని న్యాయవాది చెప్పగా 24 గంటల సమయం మాత్రమే ఇస్తారా అంటూ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ నిప్పులు చెరిగారు.
హైడ్రా ఇచ్చే నోటీసుకు సమాధానం ఇచ్చే గడువు ఇవ్వాలి కదా, గడువు కూడా లేకుండా నోటీసు ఇచ్చి ఉపయోగం ఏమిటని నిలదీశారు. బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని మండిపడ్డారు. ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారా అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మరోసారి హైడ్రాకు ఆదేశాలు జారీచేశారు. షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు బాధితులకు గడువు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. తీసుకునే చర్యలు చట్టప్రకారం ఉండాలని నొకి చెప్పారు. అనుమతులు లేకుండా పిటిషనర్ ప్రహారీ నిర్మాణం చేపట్టి ఉంటే వాటిని జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం కూల్చేయవచ్చని పేర్కొంటూ.. పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు.