హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్భంగా అంబర్‌పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద జరిగిన కార్యక్రమాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రవర్తనపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. బతుకమ్మకుంట చెరువు వద్ద ఎటువంటి పనులూ చేపట్టరాదంటూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ధిక్కరణ కేసును ఎదురొంటున్నారు.
హైడ్రా కమిషనర్ సంక్రాంతికి ముందు బతుకమ్మకుంట చెరువు వద్ద సమావేశం నిర్వహించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆ సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ. ఆ ప్రాంతంలో జిమ్, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమిభట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు పరిధిలో ఉన్న ఒక ప్రదేశాన్ని ఆరోపణలు ఎదురొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని ధర్మాసనం నిలదీసింది. హైడ్రా కమిషనర్ చేసిన ప్రసంగంలోని విషయాలను పిటిషనర్ న్యాయవాది పెన్‌డ్రైవ్ ద్వారా హైకోర్టుకు అందజేశారు. కమిషనర్‌కు ధికరణ చర్యల గురించి తెలుసునని.. గతంలో కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పారని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతివాదులు ఈ నెల 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.