హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఓ నిరుపేద కుటుంబం వెల్డింగ్ వర్స్షాపు ఏర్పాటుకు చేయూత అందించి తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ మానవత్వాన్ని చాటారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు మండలానికి చెం దిన నరేశ్ నిరుడు బీరువాల తయారీ చేస్తూ జీవనం సాగించేవాడు. ఏడాదిగా వ్యాపారం లేక కుటుంబ పోషణ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.
కానీ ఇక్కడ ఇతర పనులు దొరక్కపోవడంతో మళ్లీ బీరువాల తయారీలు చేయాలని భావించాడు. ఈ క్రమంలో మేడె రాజీవ్‌సాగర్‌ను సంప్రదించగా, ఆయన సహకారంతో బోడుప్పల్ మల్లన్న గుడి సమీపంలో శ్రీజ స్టీల్ ఫర్నిచర్ అండ్ వెల్డింగ్ వర్స్ షాపును ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, జక వెంకట్‌రెడ్డి, మందాడి సంజీవ్‌రెడ్డి, నందికొండ శ్రీనివాస్‌రెడ్డి, రసాల మహేశ్‌యాదవ్, వేణు, ప్రకాశ్‌రెడ్డి, ఎస్ఎస్ఏ ట్రస్ట్ చైర్మన్ సాయి పాల్గొన్నారు.