హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు (Heavy Rain) దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు మహబూబ్బూబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. కుండపోతగా కురుస్తున్న వానతో వాగులు, వంకలు పొంగొపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, రాష్ట్రంలో మరో 24 గంటలపాటు అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. సోమవారం కూడా భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
కాగా, శనివారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయింది. 20 జిల్లాల్లో 25 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం రికార్డయింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధికంగా 43.8 సెం.మీ వర్షపాతం నమోదయింది. మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడురులో 42.85, నెల్లికుదురులో 41.65 సెం.మీ, పెద్దనాగారం 40.28, కొమ్ములవంచలో 38.93 సెం.మీ., దంతాలపల్లి 33.25, మల్యాలలో 33 సెం.మీ, మరిపెడ 32.4, లక్కవరంలో 31.98 సెం.మీ., కేసముద్రం 29.8, అమ్మనగల్లో 28 సెం.మీ, మహబూబాబాద్‌లో 27.25 సెం.మీ., వరంగల్ జిల్లా రెడ్లవాడ 43.55 సెం.మీ, కల్లెడలో 27.88 సెం.మీ. వర్షపాతం నమోదయింది.