హైదరాబాద్, అక్టోబర్11(నమస్టే తెలంగాణ): దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా.. అన్న పాట ఊపుమీదున్నారు మద్యంప్రియులు. పండుగకు ముందే యమ లాంగించేస్తున్నారు. మూడు రోజుల్లోనే కేసులకు కేసులు సేల్ అయ్యాయి. నిరుడి కంటే ఈసారి అదనంగా అమ్మకాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా బిజినెస్ అవర్లలో సగటున ప్రతి గంటకు 25 వేల కేసుల చొప్పున మద్యం (3 లక్షల ఫుల్ బాటిల్స్) అమ్ముడుపోయిందని ఎక్పైజ్ అధికారులే చెప్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి రూ.852 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని, ఇది నిరుడి దసరా విక్రయాలతో పోలిస్తే రూ.100 కోట్ల అదనమని ఎక్సైజ్ అధికారి ఒకరు చెప్పారు. కేవలం ఏడు రోజుల వ్యవధిలో 8.5 లక్షల కేసుల లిక్కర్, 13 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. వాటి అమ్మకాల ద్వారా రూ.852 కోట్ల ఆదాయం సమకూరినట్టు టీఎస్‌బీసీఎల్ అధికారులు లెక్కలు తేల్చారు. పండుగ రోజైన శనివారం ఇంకా విక్రయాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్, రెస్టారెంట్లు ఉన్నాయి. అనుబంధంగా చట్టవిరుద్ధమైన బెల్ట్ దుకాణాలు 80 వేల వరకు ఉండొచ్చని ఒక అంచనా. మద్యం అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ టాప్‌లో ఉండగా కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం నిరుడితో పోలిస్తే సగటున 7 శాతం విక్రయాలు తగ్గినట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి.