హైదరాబాద్ : ఉత్తర, దక్షిణ ద్రోణి ఆదివారం నాడు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరం ప్రదేశం వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆగస్టు 3, 4 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక దక్షిణ తెలంగాణలో వర్షాల తీవ్రత కాస్త తగ్గింది. పలు ప్రాంతాల్లో పొడివాతావరణం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో వర్షాలు కురియడం లేదు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఉక్కపోత కూడ తీవ్రంగా ఉంది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ప్రతి రోజు వర్షం కురుస్తుంది. ఆదివారం నాడు ఉత్తర తెలంగాణ జిల్లాలైన జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది.