హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి.
రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 4 వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మోస్తరు నుంచి గట్టి జల్లులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.