హైదరాబాద్: రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హైదరాబాద్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి వాన కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నల్లమల అటవీ ప్రాంతంలో జోరువాన పడుతున్నది. దీంతో ఉమామహేశ్వర క్షేత్రాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద ఉధృతికి జలపాతాలు కనివిందు చేస్తున్నాయి. కాగా, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక, జడ్చర్లలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో పట్టణంలో ప్రభుత్వ దవాఖానను వరద నీరు చుట్టుముట్టింది. హాస్పిటల్ ప్రవేశమార్గంలో మోకాల్లోతు నీరు ప్రవహిస్తున్నది. దీంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్‌పల్లిలో పాత ఇల్లు కూలిపోయింది. అభంగాపూర్ వద్ద వాగు పారుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మందిపల్లి, పాతపల్లి, ఎమోనోన్పల్లి వద్ద వాగు ఉధృతికి వాహానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దామరగిద్ద మండలంలోని పొలాల్లో వరిపంట నీటమునిగింది.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో తిమ్మజిపేటలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, నాగర్‌కర్నూల్‌లో 8 సెం.మీ., అచ్చంపేటలో 7 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేటలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుజూర్‌నగర్‌లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, మహబూబాబాద్, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, తొర్రూరులో వాన పడుతున్నది. గార్లలో పాకాల వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తొర్రూరు మండలం కంటయపాలెం వద్ద వంపు వాగు పొంగిపొర్లుతుండటంతో తొర్రూరు-కంటాయపాలెం మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.