హైదరాబాద్/సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల పదో తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు గురువారం హెచ్చరికలు జారీచేసింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడి సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నదని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. బుధవారం ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడి సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనగామ, నారాయణపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి.
గ్రేటర్లో దంచికొట్టిన వాన
ఆవర్తనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. రాత్రి 9 గంటల వరకు అల్వాల్‌లోని మచ్చబొల్లారంలో అత్యధికంగా 9.10, ఎల్బీనగర్లో 8.40, చార్మినార్ డబీర్‌పుర 7.70, మైలార్‌దేవ్‌పల్లి 7.10, అత్యల్పంగా గచ్చిబౌలిలో 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు ముసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా మళ్లీ ముసీ వరద పారింది.
పిడుగు శబ్దానికి ఆగిన గుండె
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్పేట్కు చెందిన సయ్యద్ గౌసుద్దీన్ (35) పిడుగు శబ్దానికి గుండె ఆగి మృతి చెందాడు. గ్రామశివారులోని పొలానికి వెళ్లగా.. సమీపంలోని ఓ చెట్టుపై పిడుగు పడటంతో ఆ శబ్దానికి గౌసుద్దీన్ గుండె ఆగింది.