మహాదేవపూర్( కాళేశ్వరం ) మే 17: కాళేశ్వరంలో (Kaleshwaram) అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా వీఐపీ ఘాట్, ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. భారీ ఈదురుగాలులకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు చినిగి రోడ్డుపై పడ్డాయి. రహదారులు బురదమయం అవడంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గాలివాన బీభత్సానికి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన టెంట్లు, చలువ పందిళ్లు నేలకూలాయి. వీఐపీ ఘాట్ వద్ద లైటింగ్, స్వాగత తోరణాలు దెబ్బతిన్నాయి. దీంతో సిబ్బంది వాటికి మరమ్మతులు చేశారు. పుష్కరఘాట్ వద్ద కూలిన చలువ పందిళ్లను తొలగించారు. కాగా, పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మూడో రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు రలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు.